న్యూజిలాండ్‌తో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో 12 పరుగులు తేడాతో టీమ్ఇండియా విజయం సాధించింది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఉత్కంఠభరింతంగా సాగిన తొలి వన్డేలో టీమ్ఇండియా 12 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. శుభ్‌మన్ గిల్ (208) డబుల్ సెంచరీతో వీర విహారం చేయడంతో తొలుత బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో కివీస్ 49.2 ఓవర్లలో 337 పరుగులకు ఆలౌటైంది. న్యూజిలాండ్ బ్యాటర్లలో మైఖేల్ బ్రాస్‌వెల్ (140) శతకం బాదగా.. మిచెల్ శాంటర్న్ (57) అర్ధ శతకంతో రాణించాడు. 131 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన కివీస్‌ను మైఖేల్ బ్రాస్‌వెల్, మిచెల్ శాంటర్న్ ఆదుకున్నారు.
ముఖ్యంగా మైఖేల్ ఫోర్లు, సిక్సర్లు బాదుతూ భారత బౌలర్లపై ఎదురు దాడికి దిగి 57 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకొని మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. సిరాజ్ 46 ఓవర్లో శాంటర్న్, షిప్లే (0)ని ఔట్ చేశాడు. తర్వాత కూడా మైఖేల్ దూకుడుగా ఆడటంతో టీమ్ఇండియాకు ఒక దశలో ఓటమి తప్పదేమో అనిపించింది. చివరి రెండు ఓవర్లలో 24 పరుగులు అవసరం కాగా.. 49 ఓవర్లో హార్దిక్.. ఫెర్గూసన్ (7)ను ఔట్ చేసి నాలుగు పరుగులిచ్చాడు. శార్దూల్ వేసిన చివరి ఓవర్లో తొలి బంతికి మైఖేల్ సిక్సర్ బాది తర్వాతి బంతికే ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో ఉత్కంఠ పోరులో విజయంతో టీమ్ఇండియా సంబరాల్లో మునిగితేలింది.