ముంబయి : దేశానికి స్వాతంత్య్రం వచ్చాక మొదటిసారిగా నవభారతం పెద్ద కలలు
కంటోందని, ఆ కలలను సాకారం చేసుకునే ధైర్యాన్ని కూడా ప్రదర్శిస్తోందని ప్రధాని
నరేంద్ర మోడీ అన్నారు. ముంబయిలో రూ.38,000 కోట్ల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను
ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. భవిష్యత్తు అవసరాలకు
అనుగుణంగా మరి కొన్నేళ్లలో ముంబయి నగరం రూపురేఖలు మార్చడం బీజేపీ డబుల్
ఇంజిన్ ప్రభుత్వం ముందున్న సవాళ్లలో ఒకటన్నారు. ముంబయి మహానగర ప్రగతిలో
స్థానిక సంస్థల పాత్ర కీలకమని ఈ సందర్భంగా ప్రధాని చేసిన వ్యాఖ్యలు
దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న మున్సిపల్ ఎన్నికల సంకేతాలు ఇచ్చాయి.
కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే మాట్లాడుతూ ప్రధాని
నరేంద్ర మోడీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారన్న విషయం ఇటీవల దావోస్
పర్యటనలో తనకు తెలిసిందన్నారు. లగ్జెంబర్గ్ ప్రధాని తాను మోడీ భక్తుణ్నని
స్వయంగా తనతో చెప్పారని శిందే అన్నారు.
ముంబయి మెట్రోలో ప్రయాణించిన ప్రధాని : ప్రజా రవాణాకు కొత్త సర్వీసులను
ప్రారంభించిన అనంతరం ముంబయి మెట్రో రైలులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
ప్రయాణించారు. గుండావలీ – మోగ్రా స్టేషన్ల నడుమ సాగిన ఈ ప్రయాణంలో పలువురు
యువత, మహిళలు, మెట్రో రైలు కార్మికులతో ప్రధాని మాట్లాడారు.
నేడు 71 వేల మందికి నియామక పత్రాలు : వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో
ఉద్యోగాలకు తాజాగా ఎంపికైన 71 వేల మందికి నియామక పత్రాలను ప్రధాని నరేంద్ర
మోడీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందించనున్నారు. ‘రోజ్‌గార్
మేళా’లో పది లక్షల మందికి ఉద్యోగాలిస్తామని గతేడాది ఆయన ప్రకటించిన మేరకు
ప్రధాని కార్యాలయం ఈ ఏర్పాట్లు చేసింది. ఉద్యోగాల కల్పన విషయంలో కేంద్ర
ప్రభుత్వ నిబద్ధతను ఇది చాటిచెబుతోందని ప్రధాని కార్యాలయం పేర్కొంది. జూనియర్
ఇంజినీర్లు, లోకో పైలట్లు, టెక్నీషియన్లు, ఇన్స్పెక్టర్లు,
సబ్ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుళ్లు, స్టెనోగ్రాఫర్లు, జూనియర్ అకౌంటెంట్లు,
ఇన్‌కంట్యాక్స్ ఇన్స్పెక్టర్లు, గ్రామీణ డాక్ సేవక్‌లు, ఉపాధ్యాయులు,
నర్సులు, వైద్యులు తదితరులు ఈ నియామక పత్రాలను పొందనున్నారు.