పాణ్యం: ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ ఏరియా భూ బదలాయింపు నిబంధనలు, చట్టం ప్రకారం
గిరిజనులకు పట్టాల పంపిణీతో పాటు అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ గిరిజన సంక్షేమ శాఖ
ఉన్నతాధికారులను సూచించారు. శుక్రవారం పాణ్యం మండలంలోని నెరవాడ మెట్ట
సమీపంలోని ఏపీ గిరిజన బాలికల పాఠశాలలో గిరిజనులతో ముఖాముఖి కార్యక్రమంలో
రాష్ట్ర గవర్నర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ మాట్లాడుతూ గిరిజనుల
సంక్షేమం, వారి అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని అటవీ
హక్కుల చట్ట ప్రకారం ప్రతి గిరిజన కుటుంబానికి సాగు చేసేందుకు పట్టా భూములు
పంపిణీ చేయాలని అధికారులను సూచించారు. ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన కింద
అందించిన నిధులను గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాలలో రోడ్ల నిర్మాణానికి మరియు
అధిక ప్రాధాన్యత ప్రాతిపదికన రోడ్ల నిర్మాణాన్ని చేపట్టాలని గిరిజన సంక్షేమ
శాఖ అధికారులను కోరారు. ఆంధ్రప్రదేశ్లో గిరిజన ప్రాంతాల్లో ఇది నా మూడవ
పర్యటనని, మిమ్మల్ని వ్యక్తిగతంగా కలవడం, ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనడం
సంతోషంగా ఉందన్నారు. తాను 95.90 లక్షల గిరిజన జనాభా కలిగిన ఒడిశా రాష్ట్రం
నుండి వచ్చానన్నారు. రాష్ట్ర జనాభాలో 22.8 శాతం ఉన్నందున, ఏజెన్సీ ప్రాంతాల్లో
నివసిస్తున్న గిరిజన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తనకు తెలుసున్నారు.
ఆంధ్రప్రదేశ్లో, షెడ్యూల్డ్ తెగల జనాభా 27.39 లక్షలు, రాష్ట్ర మొత్తం
జనాభాలో 5.53% వుందన్నారు.
జిల్లా కలెక్టర్ డా.మనజీర్ జిలాని సామూన్ మాట్లాడుతూ జిల్లాలో గిరిజన సంక్షేమం
కోసం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. గిరిజన మహిళలకు వివిధ అభివృద్ధి
పథకాల కింద రు.4.16 కోట్ల అస్సెస్ట్స్ పంపిణీ చేస్తున్నట్లు వివరించారు.
పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ గిరిజన పాఠశాలల్లో
ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే
గిరిజన విద్యార్థులతో పాటు షెడ్యూల్డ్ ట్రైబ్ కులాలకు కూడా పాఠశాలల్లో ప్రవేశం
కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్
హరిచందన్ గిరిజన మహిళలకు సంక్షేమ పథకాల లబ్ధి మెగా చెక్ ను పంపిణీ చేశారు.