శ్రీ కపిలేశ్వరాలయంలో మహాపూర్ణాహుతితో ముగిసిన విశ్వశాంతి హోమం
తిరుపతి : లోకకల్యాణం కోసం శ్రీవారిని ప్రార్థిస్తూ ప్రతినెలా హోమాలు
నిర్వహిస్తామని టిటిడి ధర్మకర్తల మండల అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి
తెలిపారు. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరాలయంలో ఈ నెల 16 నుంచి ఆరు రోజులపాటు
జరిగిన విశ్వశాంతి హోమం శనివారం మహా పూర్ణాహుతితో ముగిసింది. ఈ కార్యక్రమంలో
వైవి.సుబ్బారెడ్డి దంపతులు, జెఈవో శ్రీ వీరబ్రహ్మం దంపతులు పాల్గొన్నారు. ఈ
సందర్భంగా ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ దేశ, రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో
ఉండాలని, కరోనా లాంటి మహమ్మారి ఇకపై రాకుండా ఉండాలని స్వామివారిని
ప్రార్థిస్తూ విశ్వశాంతి హోమం నిర్వహించినట్టు తెలిపారు. ఇందులో భాగంగా శ్రీ
గణపతి హోమం, శ్రీ సుబ్రమణ్యస్వామివారి హోమం, శ్రీ దుర్గ, శ్రీ లక్ష్మీ, శ్రీ
సరస్వతి అమ్మవార్ల హోమం, శ్రీ నవగ్రహ హోమం, శ్రీ దక్షిణామూర్తి స్వామివారి
హోమం, శ్రీ రుద్ర, శ్రీ మృత్యుంజయ స్వామి వారి హోమాలు నిర్వహించినట్టు
తెలిపారు.
తిరుపతిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాలయంలో యాగాల నిర్వహణకు శాశ్వతంగా యాగశాల
ఏర్పాటు చేశామని, ఇకపై ప్రతినెలా అక్కడ యాగాలు నిర్వహిస్తామని వివరించారు.
ముందుగా గణపతి పూజ, పుణ్యాహవాచనం, కలశ స్థాపన, అగ్ని ప్రతిష్ట, శ్రీ రుద్ర,
మృత్యుంజయ స్వామి వారి హోమం, మహాపూర్ణాహుతి, నివేదన, హారతి నిర్వహించారు. ఆ
తరువాత ఛైర్మన్ దంపతులు గోపూజ చేశారు. ఈ కార్యక్రమంలో సిఏవో శేషశైలేంద్ర, ఐటి
జిఎం సందీప్, డెప్యూటీ ఈవో దేవేంద్ర బాబు, ఏఈవో పార్థసారథి, సూపరింటెండెంట్
భూపతి తదితరులు పాల్గొన్నారు.