స్విట్జర్లాండ్ లోని దావోస్ నగరంలో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కూడా పాల్గొనడం తెలిసిందే. గత
కొన్నిరోజులుగా పారిశ్రామికవేత్తలతో సమావేశాలతో కేటీఆర్ బిజీగా గడిపారు. పలు
పరిశ్రమలను తెలంగాణకు వచ్చేలా చేయడంలో ఆయన సఫలమయ్యారు. తాజాగా, దావోస్ లో
కేటీఆర్ పర్యటన దిగ్విజయంగా ముగిసిందని ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
వెల్లడించింది. తెలంగాణలో దాదాపు రూ.21 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పలు
అంతర్జాతీయ కంపెనీలు ముందుకు వచ్చాయని తెలిపింది. దావోస్ లో నాలుగు రోజుల
పర్యటనలో కేటీఆర్ 52 వ్యాపార సమావేశాలు, 6 రౌండ్ టేబుల్ సమావేశాలు, 2 ప్యానెల్
చర్చలు నిర్వహించినట్టు వివరించింది.