విజయవాడ : విశాఖపట్నంలో బ్రెయిన్ డెడ్ అయిన ఓ మహిళ గుండెను ప్రత్యేక విమానంలో
తిరుపతికి తరలించి, గుండె మార్పిడితో ఓ నిరుపేద బాలుడికి పునర్జన్మనిచ్చిన
సన్నివేశం అత్యంత ప్రశంసనీయమని, ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక
అభినందనలు తెలియజేస్తున్నట్లు రాజ్యసభ సభ్యులు, వైసీపీ జాతీయ ప్రధాన
కార్యదర్శి విజయసాయి రెడ్డి కొనియాడారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా శనివారం
పలు అంశాలు వెల్లడించారు. తిరుపతి టీటీడీ శ్రీ పద్మావతి చిన్నపిల్లల గుండె
చికిత్సాలయం లో తొలి గుండె మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తి చేసిన
సందర్భంగా అభినందనలు తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా ఆపరేషన్ నిర్వహించి
చిన్ని గుండెకు ఊపిరి పోసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైద్య రంగ సంస్కరణలు
ఆదర్శనీయమని అన్నారు.
సోషల్ మీడియా మార్గదర్శకాలు విధిగా పాటించాలి : కేంద్ర ప్రభుత్వం సామాజిక
మాద్యమాల్లో ప్రకటనకు సంబంధించి జారీచేసిన మార్గదర్శకాలు విధిగా అనుసరించాలని
విజయసాయి రెడ్డి అన్నారు. ఈ మార్గదర్శకాలు విధిగా పాటించడం ద్వారా ప్రజలను
తప్పుదోవ పట్టించే ప్రకటనలకు చెక్ పెట్టవచ్చని అన్నారు.