అమరావతి : ఏపీ కేడర్‌కు రిపోర్టు చేసిన తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్‌కు
ఏపీ ప్రభుత్వం ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు. దీంతో ఆయనకు ఏ శాఖ
అప్పగిస్తారనేదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు
ఏపీ కేడర్‌కు రిపోర్టు చేసిన మాజీ సీఎస్ సోమేశ్ కుమార్‌కు పోస్టింగ్ ఇచ్చే
అంశంపై సమాలోచనలు జరుగుతున్నాయి. సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేసిన
సోమేశ్‌కుమార్‌కు ఏ శాఖ అప్పగించాలి? అన్న అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం
పరిశీలిస్తోంది. ఆయనను వాణిజ్య పన్నుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా
నియమించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రంలో మరికొందరు సీనియర్
ఐఏఎస్‌ల బదిలీలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. 2019లో వైకాపా అధికారం చేపట్టిన
నాటి నుంచి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ, గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా
ఉన్న గోపాలకృష్ణ ద్వివేదితో పాటు సెలవుపై వెళ్లి తిరిగి రిపోర్టు చేసిన పాఠశాల
విద్యాశాఖ మాజీ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్‌కు ఇతర శాఖలు
అప్పగించనున్నట్టు తెలుస్తోంది. గోపాలకృష్ణ ద్వివేదికి వ్యవసాయశాఖతో పాటు
బుడితి రాజశేఖర్‌కు పంచాయితీ రాజ్ శాఖలు అప్పగిస్తారని సమాచారం.