విజయవాడ : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అభివృద్ధి జరుగుతుందని నారా
లోకేష్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని రాజ్యసభ సభ్యులు, వైసీపీ జాతీయ
ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి అన్నారు. ట్విట్టర్ వేదికగా ఆదివారం పలు
అంశాలపై ఆయన తనదైన శైలిలో స్పందించారు. తెదేపా అధికారంలో ఉన్న సమయంలో 2014-19
మధ్య అమరావతిలో ఒక్క ఇటుక కూడా ఎందుకు చేయలేకపోయారని ఆయన ప్రశ్నించారు.
తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి కేవలం ఒక్క కుటుంబానికి, ఒక్క
సామాజిక వర్గానికి, ఒక్క జిల్లాకే అన్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని
అన్నారు. చంద్రబాబు హయాంలో సంతకాలు చేసిన ఎంవోయూలు (మెమోరాండం ఆఫ్ అండర్
స్టాండింగ్) వల్ల ఒరిగిందేంటో రాష్ట్ర ప్రజలకు తెలుసని అన్నారు. పార్లమెంట్
నూతన భవనం అత్యంత ఆకర్షణీయంగా ఉందని, 135 కోట్ల భారతదేశ ప్రజలు
ప్రజాస్వామ్యంపై పెట్టుకున్న నమ్మకానికి ప్రతీకగా దర్శనమిస్తోందని విజయసాయి
రెడ్డి పేర్కొన్నారు. భారతదేశ సంస్కృతి, ఆధునికతల సమ్మేళనం ప్రతిభించిస్తోందని
అన్నారు. విశాఖ నగరానికి చెందిన 11 ఏళ్ల చెస్ క్రీడాకారిణి మీనాక్షికి క్రీడల
విభాగంలో కేంద్ర ప్రభుత్వ బాల పురస్కార్ -2023 అవార్డు లభించడం
రాష్ట్రానికే గర్వకారణమని విజయసాయి రెడ్డి అన్నారు. ఈ చెస్ చిచ్చరపిడుగు
అండర్-12 కేటగిరీలో బాలికల విభాగంలో ప్రపంచంలోనే ప్రధమ స్థానంలో ఉందని ఇది
దేశానికే గర్వకారణమని అన్నారు. అండమాన్ నికోబార్ ప్రాంతంలో నామకరణం చేయని 21
ద్వీపాలకు పరమవీర చక్ర అవార్డులు అందుకున్న భరతమాత ముద్దుబిడ్డలు, సైనిక
అమరవీరులు పేర్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం గర్వించదగ్గ విషయమని
విజయసాయి రెడ్డి అన్నారు. దేశం కోసం వారు చేసిన త్యాగాలు, చూపించిన సాహసం
ఎప్పటికీ మరువలేమని అన్నారు. ఈ అమరవీరుల త్యాగాలు, వీరోచిత కథలు తెలుసుకొని
రానున్న తరాలవారు ఎంతగానో స్ఫూర్తి పొందుతారని ఆయన అన్నారు.