పాకిస్థాన్‌పై సర్జికల్ దాడులు చేశామని గొప్పగా చెప్పుకుంటున్న కేంద్ర
ప్రభుత్వం అందుకు సంబంధించి ఇప్పటి వరకు ఒక్క ఆధారాన్ని కూడా ఎందుకు
బయటపెట్టలేదని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ప్రశ్నించారు.
జమ్మూకశ్మీర్‌లో జరుగుతున్న భారత్ జోడో యాత్రలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈ
వ్యాఖ్యలు చేశారు. పుల్వామాలో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్
జరిపిన దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందారని, ఈ ఘటనపై ఇప్పటి
వరకు ప్రభుత్వం పార్లమెంటుకు ఎలాంటి నివేదిక సమర్పించలేదని ఆగ్రహం వ్యక్తం
చేశారు. ఉగ్రదాడులకు అవకాశం ఉన్న పుల్వామాలో కార్లను నిత్యం తనిఖీ
చేస్తుంటారని, కానీ దాడి జరిగిన రోజు ఉగ్రవాదులు ప్రయాణిస్తున్న కారును తనిఖీ
చేయకుండా ఎలా వదిలేశారని ప్రశ్నించారు. సర్జికల్ దాడుల్లో ఎంతోమంది
ఉగ్రవాదులను మట్టుబెట్టామని చెబుతున్న కేంద్రం ఇప్పటి వరకు ఒక్క ఆధారాన్ని
కూడా ఎందుకు బయటపెట్టలేకపోయిందని దిగ్విజయ్ నిలదీశారు.