భారీగా ఉద్యోగులను తొలగిస్తున్న కంపెనీలు
ఉద్యోగాలను కోల్పోయిన 2 లక్షల మంది ఐటీ నిపుణులు
60 రోజుల్లో కొత్త ఉద్యోగం వెతుక్కోకపోతే ఇండియాకు రావాల్సిందే
ప్రపంచాన్ని భారీ ఆర్థికమాంద్యం మరోసారి కుదిపేయబోతోందని ఆర్థిక నిపుణులు
చెపుతున్న సంగతి తెలిసిందే. దీని ప్రభావం ఇప్పటికే కనిపిస్తోంది. గూగుల్,
మైక్రోసాఫ్ట్, ఫేస్ బుక్, అమెజాన్ వంటి పలు కంపెనీలు ఉద్యోగులను
తొలగిస్తున్నాయి. అమెరికాలో భారత్ కు చెందిన పలువురు ఐటీ నిపుణులు ఉద్యోగాలను
కోల్పోయారు. ఉద్యోగాలను కోల్పోయిన మన వాళ్లు అక్కడ మరో ఉద్యోగాన్ని
సంపాదించడానికి చాలా కష్టాలు పడుతున్నారు. వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం గత
నవంబర్ మాసం నుంచి దాదాపు 2 లక్షల మంది సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు ఉద్యోగాలను
కోల్పోయారు. వీరిలో 30 నుంచి 40 శాతం మంది భారతీయులే అనేది ఒక అంచనా. వీరిలో
ఎక్కువ మంది హెచ్ 1బీ, ఎల్1 వీసాలపై వెళ్లినవారు ఉన్నారు. హెచ్1బీ వీసాపై
వెళ్లినవారు 60 రోజుల్లో కొత్త జాబ్ ను వెతుక్కోవాల్సి ఉంటుంది. లేని పక్షంలో
ఇండియాకు తిరిగిరావడం మినహా వారికి మరో మార్గం ఉండదు. ప్రస్తుతం అమెరికాలో
భారీగా లేఆఫ్ లు చోటుచేసుకుంటున్న తరుణంలో వీరు కొత్త ఉద్యోగాలను వెతుక్కోవడం
కష్టమనే చెప్పుకోవాలి.