సచివాలయంలో ఆక్వా ఎంపవరింగ్ కమిటీ సమావేశం
సమావేశంలో పాల్గొన్న మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స
సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు, అప్సడా వైస్ చైర్మన్ వి.రఘురాం
వెలగపూడి సచివాలయం : సచివాలయంలోని మూడోబ్లాక్ లో సోమవారం ఆక్వా సాధికారిత
కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,
బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు, అప్సడా వైస్ చైర్మన్ వి.రఘురాం,
స్పెషల్ చీఫ్ సెక్రటరీ (ఇంధనశాఖ) కె.విజయానంద్, మత్స్యశాఖ కమిషనర్ కన్నబాబు,
ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సాధికారిత కమిటీ ద్వారా
ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన అంశాలపై కమిటీ సమీక్షించింది. ఈ
సందర్బంగా మంత్రులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఆక్వా రంగంను బలోపేతం చేసేందుకు
సీఎం జగన్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. ఇప్పటికే ఆక్వా సాధికారిత
కమిటీ ద్వారా ఆక్వారంగంలోని సమస్యలను పరిష్కరించేందుకు, రైతులకు అండగా
నిలిచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఆక్వా రైతులకు అండగా
నిలవడం, సీడ్, ఫీడ్ రేట్లను శాస్త్రీయంగా నిర్ణయించడం, ధరల స్థిరీకరణ వంటి
అంశాల్లో సాధికారిత కమిటీ తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తున్నాయని
అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.12 లక్షల హెక్టార్ లలో ఆక్వా సాగు జరుగుతోందని
అన్నారు. ఈ-ఫిష్ సర్వే ఆధారంగా ఈ రంగంపై మొత్తం 1.38 లక్షల మంది రైతులు
ఆధారపడి ఉన్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.27 ఎంటిల ఆక్వా ఉత్పత్తులను
నిల్వ చేసేందుకు 111 కోల్డ్ స్టోరేజీలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. రాష్ట్ర
వ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న ఆక్వాలో కనీసం 30 శాతం రాష్ట్ర అవసరాలకు
వినియోగించుకునేలా ప్రజల్లో అవగాహన పెంచేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రులు
ఆదేశించారు. తాజాగా ఆక్వాజోన్ లోపల, వెలుపల
సాగవుతున్న విస్తీర్ణంను గుర్తించేందుకు మత్స్యశాఖ నిర్వహిస్తున్న సర్వే వచ్చే
నెలాఖరు నాటికి పూర్తవుతుందని అన్నారు. ఇప్పటికే 26వేల కనెక్షన్ లకు ప్రభుత్వం
విద్యుత్ సబ్సిడీని అందిస్తోందని అన్నారు. ఈ సర్వే ద్వారా ఆధార్ తో ఆక్వారైతుల
వివరాలు అనుసంధానం అవుతాయని, ఖచ్చితంగా ఎంతమంది అర్హులైన రైతులు ఉన్నారో
నిర్ధిష్టంగా తెలుస్తుందని అన్నారు. అర్హత ఉన్న ప్రతి ఆక్వా రైతుకు విద్యుత్
సబ్సిడీని అందించాలని సీఎం జగన్ నిర్ధేశించారని, ఆ మేరకు అధికారులు చర్యలు
తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో స్పెషల్ సీఎస్ (ఇంధనశాఖ) కె.విజయానంద్,
మత్స్యశాఖ కమిషనర్ కన్నబాబు, కమిషనర్ & డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్
ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.