అమెరికా : అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్వగృహంలో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలలో రిపబ్లికన్ హిందూ సమాఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రంప్ భారతీయులను ఉద్దేశ్యించి మాట్లాడారు. అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన స్వగృహంలో ఘనంగా దీపావళి పండుగను జరుపుకున్నారు. పలు భారతీయ సంఘాల ప్రతినిధులతో కలిసి శాస్త్రోక్తంగా దీపావళి వేడుకలను నిర్వహించారు. రిపబ్లికన్ హిందూ సమాఖ్య ప్రతినిధులు షల్లీ కుమార్, హరిభాయ్ పటేల్ తో పాటు తానా మాజీ అధ్యక్షుడు సతీష్ వేమన పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమెరికా వ్యాప్తంగా ఉన్న భారతీయ సంఘాలనుద్దేశించి ట్రంప్ ప్రసగించారు.
అనాదిగా చెడుపై మంచి ఎప్పుడూ విజయం సాధిస్తుందని, సమస్త మానవాళి శాంతి సౌబ్రాత్రుత్వంతో మెలగాలని ఆకాంక్షిస్తూ ట్రంప్ దీప ప్రజ్వలన చేశారు. భవిష్యత్ లో భారత్ అమెరికా దౌత్య సంబంధాలు, పరస్పర సహాయ సహకారాలు ఉన్నతస్థాయిలో కొనసాగాలని ఆయన అభిలాషించారు. 2016 ఎన్నికలలో తన వెన్నంటి ఉండి బలపరచిన రిపబ్లికన్ హిందూ సమాఖ్య నాయకత్వానికి, సభ్యులకు ట్రంప్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. తమ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే, హిందు సమాఖ్య సభ్యులను తన ప్రభుత్వ కార్య నిర్వహణలో కీలక భాగస్వాములను చేస్తామని తెలిపారు.
భారతదేశం ఎదుర్కోంటున్న పలు సమస్యలపై సానుకూల దృక్పథాన్ని అవలంబించి, సంయుక్తంగా టెర్రరిజం మూలాలను ఏరిపారేస్తామని డోనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. భారతీయులు శాంతి కాముకులని, ఎలాంటి పరిస్థితులలోఐనా కష్టపడి, సానుకూల దృక్పథంతో ముందు సాగే వారి స్వభావమే వారికి ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టిందని అన్నారు. అమెరికాలో తమ మూలాలను కాపాడుకుంటూనే, అమెరికా అభివృద్దిలో కీల పాత్ర పోషిస్తున్నారని రిపబ్లికన్ హిందూ సమాఖ్య వ్యవస్థాపకుడు షల్లీ కుమార్ను, కార్యవర్గ సభ్యులు తానా మాజీ అధ్యక్షుడు సతీష్ వేమన ను ట్రంప్ ప్రత్యేకంగా అభినందించారు.