నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న టాక్ షో అన్
స్టాపబుల్. ఇప్పుడీ షో రెండో సీజన్ నడుస్తోంది. ఇటీవల జనసేనాని పవన్ కల్యాణ్
తో రూపొందించిన ఇంటర్వ్యూ తొలి ఎపిసోడ్ ఆహా ఓటీటీ రికార్డులను తిరగరాసింది.
ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ రెండో పార్ట్ కూడా వచ్చేస్తోంది. దీనికి సంబంధించిన
ప్రోమోను ఆహా ఓటీటీ యూట్యూబ్ లో విడుదల చేసింది. ఇటీవల ఓ కారుపైన కూర్చుని
ప్రయాణించడం ఎందుకో పవన్ ఈ ఇంటర్వ్యూలో వివరించారు. ప్రతి దానికి ఆంక్షలు
విధిస్తున్నారని, దాంతో చాలారోజుల తర్వాత తిక్క వచ్చిందని ఛలోక్తి విసిరారు.
ఎప్పట్లాగానే బాలకృష్ణ తనదైన శైలిలో సూటిగా ప్రశ్నలు సంధించారు. సొంతగా
పార్టీ పెట్టుకోవడం ఎందుకు.. టీడీపీలో చేరొచ్చు కదా? అంటూ పవన్ ను అడగడం
ద్వారా బాలయ్య తన ట్రేడ్ మార్కు చూపించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ పవన్ ను
అభిమానిస్తారని, మరి ఆ అభిమానం ఓట్ల రూపంలోకి ఎందుకు మారలేదని ప్రశ్నించారు.
మరి బాలయ్య ప్రశ్నలకు పవన్ కల్యాణ్ ఏం సమాధానం చెప్పారన్నది ఫిబ్రవరి 10న
ప్రసారమయ్యే ఫైనల్ ఎపిసోడ్ లో చూడాల్సిందే.