విజయవాడ : ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి మూడున్నరేళ్ల సంక్షేమ,
అభివృద్ధి పాలనకు చంద్రబాబు 14 ఏళ్ల అనుభవం ఏమాత్రం సాటిరాదని ప్లానింగ్
బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. గడప గడపకు
మన ప్రభుత్వం 150 రోజుల విజయోత్సవ వేడుకలు గవర్నర్ పేటలోని స్వాతంత్ర సమరయోధుల
భవనంలో సోమవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ
శైలజారెడ్డి, వైఎస్సార్ సీపీ డివిజన్ ఇంఛార్జి ఆత్మకూరు సుబ్బారావు,
కోఆర్డినేటర్ ఒగ్గు విక్కీతో కలిసి మల్లాది విష్ణు పాల్గొన్నారు. పార్టీ
శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. తొలుత 98వ సచివాలయ
పరిధిలోని రాజగోపాలచారి వీధి, అలీబేగ్ వీధి, డి.టి.రావు వీధి, మేరీ వీధి,
క్యానం వారి వీధి, కాజా పున్నయ్య వీధి, మసీదు వీధి, అట్టారత్తయ్యవీధి,
గోపువారి వీధి, గూడవల్లి వారి వీధి, బందర్ రోడ్డు, గోపాలరెడ్డి రోడ్డులలో
అధికారులు, ప్రజాప్రతినిధులు విస్తృతంగా పర్యటించి 307 గడపలను సందర్శించారు.
ప్రజల యోగక్షేమాలపైనే అనుక్షణం దృష్టి సారిస్తూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం
ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకుంటున్నట్లు మల్లాది విష్ణు వెల్లడించారు.
గవర్నర్ పేట అంటేనే వ్యాపార సముదాయాలకు కేంద్ర బిందువని, అటువంటి ప్రాంత
అభివృద్ధిని గత తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని మల్లాది విష్ణు
అన్నారు. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కనీవినీ ఎరుగని రీతిలో ప్రాంత
రూపురేఖలు మార్చడం జరిగిందన్నారు. అలాగే టీడీపీ కార్పొరేటర్లు ఉన్న ప్రతిఒక్క
డివిజన్ ను మూడున్నరేళ్లలో అభివృద్ధికి కేరాఫ్ గా మార్చామని, వైఎస్సార్ సీపీ
అభ్యర్థులను ఎందుకు గెలిపించుకోలేకపోయామనే భావన ప్రజలలో స్పష్టంగా
కనిపించిందన్నారు.
ప్రజా సమస్యల తక్షణ పరిష్కారమే లక్ష్యం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు నియోజకవర్గంలో గడప గడపకు మన
ప్రభుత్వం కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని, ఇందులో అధికారులు,
ప్రజాప్రతినిధులు, సచివాలయ ఉద్యోగుల పాత్ర అభినందనీయమని మల్లాది విష్ణు
అన్నారు. ముఖ్యంగా 54 సచివాలయాల పరిధిలో 51,105 ఇళ్లను సందర్శించినప్పుడు
ప్రజల నుంచి లభించిన స్పందన అపూర్వమన్నారు. ఈ 150 రోజుల్లో దీర్ఘకాలంగా
పెండింగ్ ఉన్న అనేక స్థానిక సమస్యలకు పరిష్కారం లభించిందన్నారు. ముఖ్యమంత్రి
జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేయడం ఒక అదృష్టంగా భావిస్తూ వాలంటీర్లందరూ
ప్రజలకు నిస్వార్థంగా సేవలందిస్తున్నారని మల్లాది విష్ణు పేర్కొన్నారు. కోవిద్
సమయంలో బయటకు రావాలంటేనే భయపడుతున్న సమయంలో వీరంతా ప్రాణాలకు తెగించి ప్రజలకు
సేవలందించారన్నారు. కరోనా టెస్టులు నిర్వహించడం, వ్యాక్సినేషన్, డోర్ టూ డోర్
ఫీవర్ సర్వే ఎప్పటికప్పుడు పూర్తిచేయడంతో.. ప్రభుత్వ పనితీరు పట్ల ప్రధాని
సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారన్నారు. అదే రీతిన పనిచేసి కన్వీనర్లు, గృహ
సారథులు సైతం మంచిపేరు తెచ్చుకోవాలని సూచించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ
అంతిమ లక్ష్యం ప్రజా సమస్యల తక్షణ పరిష్కారం తప్ప అధికారాన్ని అనుభవించడం
ఏమాత్రం కాదని పునరుద్ఘాటించారు.