*లండన్ : మందిరం, మసీదు, చర్చి మత సామరస్యం వెల్లి విరిసేలా ఈ మూడు పక్క పక్కనే ఉంటే ఎంతో హృద్యంగా ఉంటుంది కదా. ఇప్పుడలాంటి దృశ్యమే బ్రిటన్‌లో ఆవిష్కృతమైంది. ఒక్కో మతానికి చెందిన వారు ఒక్కో పదవిలో అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాను తలపిస్తున్నారు. బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్–3 క్రిస్టియన్. లండన్ మేయర్ సాదిక్ ఖాన్ ముస్లిం. 2016లో నగర తొలి ముస్లిం మేయర్‌గా ఎన్నికై రికార్డు సృష్టించారు. పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన బస్సు డ్రైవర్ కుమారుడైన సాదిక్ లండన్ లా వర్సిటీ నుంచి న్యాయవాద పట్టా తీసుకొని దశాబ్దానికి పైగా మానవ హక్కుల లాయర్‌గా పనిచేశారు. ఇప్పుడు భారతీయ మూలాలున్న హిందువు రిషి ప్రధాని అయ్యారు. హిందువునని చెప్పుకోవడానికి గర్విస్తానని రిషి ప్రకటించుకున్నారు. మూడు మతాలకు చెందిన ముగ్గురు బ్రిటన్‌లో కీలక హోదాల్లో ఉండటం మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.
మళ్లీ హోం మంత్రి బ్రేవర్మన్ : ప్రధాని కాగానే సునాక్ తన కేబినెట్‌కు టీమ్‌ను ఏర్పాటు చేసుకుంటున్నారు. భారతీయ మూలాలున్న సుయెల్లా బ్రేవర్‌మాన్‌ను మళ్లీ హోం మంత్రిగా నియమించారు. ఆర్థికమంత్రి జెరేమీ హంట్‌ను కొనసాగించనున్నారు. తనకు సానుకూలంగా కాకపోయినా విదేశాంగ మంత్రి జేమ్స్ క్లవర్లీనీ కొనసాగిస్తున్నారు. జాన్సన్ హయాంలో ఉపప్రధాని, న్యాయ మంత్రిగా పనిచేసిన డొమినిక్ రాబ్‌ను అవే పదవుల్లో నియమించనున్నారు. మంత్రిత్వ శాఖ వ్యవహారాలు చూసే భారతీయ మూలాలున్న ఎంపీ అలోక్ మిశ్రా తన పదవి నుంచి తప్పుకుంటున్నారు.