నాగ్‌పూర్ టెస్టులో భారత్ పట్టు బిగిస్తోంది. తొలి రోజు ఆస్ట్రేలియాను 177
పరుగులకే కట్టడి చేసింది. ఆ తర్వాత ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ ఆట
ముగిసే సరికి 77 రన్స్ చేసింది. ఓపెనర్లు రోహిత్ (56), రాహుల్ (21)
శుభారంభం ఇచ్చారు. అయితే.. మొదటి రోజు ఆట మరో ఎనిమిది బంతుల్లో ముగుస్తుంది
అనగా ఓపెనర్ రాహుల్ ఔటయ్యాడు. మర్ఫీ ఓవర్లో అతనికే క్యాచ్ ఇచ్చి
వెనుదిరిగాడు. టెస్టుల్లో అతనికిదే మొదటి వికెట్. దాంతో 76 రన్స్ వద్ద
భారత్ తొలి వికెట్ కోల్పోయింది. రవిచంద్రన్ అశ్విన్ నైట్ వాచ్‌మెన్‌గా
క్రీజులోకి వచ్చాడు. మొదటి రోజు ఆట ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి
77 రన్స్ చేసింది. ఇంకా 100 రన్స్ వెనకంజలో ఉంది. రెండో రోజు భారీ స్కోర్
చేసి మ్యాచ్‌పై పట్టు బిగించాలని రోహిత్ సేన భావిస్తోంది.
తొలి ఓవర్లోనే 3 ఫోర్లు
భారత కెప్టెన్ రోహిత్ తొలి ఓవర్ నుంచే దూకుడు కనబరిచాడు. కమిన్స్ వేసిన
ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే అతను మూడు ఫోర్లు బాదాడు. దాంతో, ఆసీస్‌ను
ఒత్తిడిలోకి నెట్టాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా బౌలర్లు ఎంత ప్రయత్నించినా
వికెట్ తీయలేకపోయారు. ఆ జట్టు స్టార్ స్పిన్నర్ నాథన్ లియన్ కూడా
ప్రభావం చూపలేకపోయాడు. రోహిత్ 66 బంతుల్లోనే ఫిఫ్టీ బాదాడు. 56 పరుగులు
చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి.
అతనికి రాహుల్ చక్కని సహకారం అందించాడు. వీళ్లిద్దరూ ఆసీస్ బౌలర్లను
సమర్థంగా ఎదుర్కొన్నారు. రాహుల్ 70 బంతుల్లో 21 రన్స్ చేశాడు.
జడేజా స్పిన్‌కు ఆసీస్ దాసోహం
ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా స్పిన్‌కు ఆసీస్ దాసోహం అయింది. ఈ నంబర్ వన్
ఆల్‌రౌండర్ ఐదు వికెట్లు తీసి ఆ జట్టును దెబ్బతీశాడు. కీలకమైన లబుషేన్,
స్టీవ్ స్మిత్ వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. దాంతో బోర్డర్- గవాస్కర్
ట్రోఫీ మొదటి టెస్టులోఆతిథ్య ఆస్ట్రేలియా 177 రన్స్‌కే కుప్పకూలింది. టాస్
గెలిచిన ఆసీస్ కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆ జట్టుకు ఆదిలోనే దెబ్బ
తగిలింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా, డేవిడ్ వార్నర్ వెంట వెంటనే ఔటయ్యారు.
ఆ తర్వాత లబుషేన్ (49), స్టీవ్ స్మిత్ (37) మూడో వికెట్‌కు 84 రన్స్
జోడించారు. అయితే, రెండో సెషన్లో జడేజా విజృంభించాడు. ఒకే ఓవర్లో
లబుషేన్, రెన్ షా వికెట్లు తీసి ఆసీస్‌ను దెబ్బ తీశాడు. కీపర్ అలెక్స్
క్యారీ (36), హ్యాండ్స్కాంబ్ (31) ఫిఫ్టీ పార్ట్నర్షిప్తో జట్టును
ఆదుకున్నారు. చివర్లో అశ్విన్ కూడా మూడు వికెట్లతో చెలరేగడంతో ఆ జట్టు
177 రన్స్‌కు పరిమితం అయింది. సిరాజ్, షమీ తలా ఒక వికెట్ పడగొట్టారు.