విజయవాడ : ఇతర భాషలను నేర్చుకునే ముందు తమ మాతృభాషను ప్రేమించేలా
విద్యార్ధులను ప్రోత్సహించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్
హరిచందన్ అన్నారు. మాతృభాష మాధ్యమంగా సాగే సంభాషణలు, రచనలు ఎంతో ప్రభావవంతంగా
ఉంటాయన్నారు. నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన
33వ విజయవాడ పుస్తక మహోత్సవాన్ని శుక్రవారం గవర్నర్ ప్రారంభించారు. ఈ
సందర్భంగా హరిచందన్ మాట్లాడుతూ మాతృభాషపై ప్రేమ, అభిరుచి పెంపొందించడానికి
పుస్తకాలు ఉత్తమ సాధనమన్నారు. మాతృభాషలోని పుస్తకాల నుండి గొప్ప ఇతిహాసాలు,
నీతి కథలను చదవమని ప్రోత్సహించిన తన చిన్ననాటి రోజులు ఇంకా గుర్తున్నాయన్నారు.
గవర్నర్గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ఇక్కడి విద్యావేత్తలు, సాహిత్య
ప్రముఖులతో నెలకొన్న సాంగత్యం ఫలితంగా తెలుగు భాష యొక్క గొప్పతనం గురించి తనకు
మంచి అవగాహన వచ్చిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా 81 మిలియన్ల మంది తెలుగు
మాట్లాడుతుండగా, దేశంలో అత్యధికంగా మాట్లాడే భాషలలో తెలుగు నాల్గవదన్నారు. ఒక
పుస్తకం మనకు విజ్ఞానం, వినోదం అందిస్తూ కొత్త ఆలోచనల ప్రపంచంలోకి
తీసుకువెళుతుందని గవర్నర్ వివరించారు. పుస్తకాలు మనల్ని మరింత జ్ఞానవంతం
చేస్తాయని, పుస్తకం నిజమైన స్నేహితుడని, అతను ప్రతిఫలంగా పాఠకుడి నుండి ఏమీ
ఆశించడన్నారు. పిల్లలతో కలిసి పుస్తక ప్రదర్శనను సందర్శించి మంచి పుస్తకాలు
పొందేలా, చిన్నప్పటి నుండే పుస్తకాలు చదివేలా వారిని ప్రోత్సహించాలని
తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేసారు. చిన్నారుల పుస్తకాలు చదువుతూ పెరిగేకొద్దీ
మంచి జ్ఞానంతో సాధికారత పొందుతారన్నారు. పుస్తక పఠనం వల్ల మెదడుకు వ్యాయామం,
మెరుగైన జ్ఞాపకశక్తి, దృష్టి కేంద్రీకరణ, సాహిత్య నైపుణ్యం, మంచి నిద్ర,
ఒత్తిడిని అధికమించటం సాధ్యమవుతుందన్నారు. విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ
ప్రతి సంవత్సరం బుక్ ఫెయిర్ నిర్వహించేందుకు చేస్తున్న కృషి అభినందనీయమని,
200కి పైగా ప్రచురణ సంస్థలు పాల్గొంటున్న పుస్తక మహోత్సవం విజయవంతం కావాలని
బిశ్వభూషణ్ అన్నారు. తెలుగు సినిమా రచయితగా, నటుడిగానే కాక, రేడియోకు చేసిన
సాహిత్య సహకారానికి గుర్తింపుగా దివంగత గొల్లపూడి మారుతీరావు పేరును
పుస్తకమహోత్సవ ప్రధాన వేదికకు పెట్టడం ముదావహమన్నారు. పుస్తకమహోత్సవ సొసైటీకి
చేసిన సేవలకు గుర్తింపుగా విక్రమ్ రామస్వామిగా ప్రసిద్ధి చెందిన దివంగత
రావిక్రింది రామస్వామికి తగిన గౌరవం ఇవ్వటం అభినందనీయమన్నారు. విజయవాడకు
చెందిన కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ ‘వేయి పడగలు’ నవలకి భారతీయ అత్యున్నత
సాహిత్య పురస్కారమైన ‘జ్ఞానపీఠ్’ అవార్డును పొందడం తెలుగు వారికి గర్వకారణమని,
నాటి ప్రధాని దివంగత పి.వి.నరసింహారావు హిందీలోకి అనువదించి సాహితీవేత్త
గొప్పతనాన్ని చాటి చెప్పారన్నారు. తెలుగు భాషా ఔన్నత్యాన్ని సజీవంగా
నిలిపేందుకు ప్రచురణ సంస్థలు చేస్తున్న కృషికి గుర్తింపుగా ఎమెస్కో విజయ
కుమార్, విశాలాంధ్ర బుక్ హౌస్ ప్రతినిధులను గవర్నర్ సత్కరించారు.