నల్గొండ : మును గోడు ఉప ఎన్నిక పోలింగ్ రోజున ఓటర్లు ఓటు హక్కు వినియోగించు కునేలా పోలింగ్ స్టేషన్లలో కనీస వసతులు కల్పించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి. వినయ్‌కృష్ణారెడ్డి ఆదేశించారు.
మునుగోడు నియోజకవర్గ పరిధిలోని నాంపల్లి మండలంలో నాం పల్లి, మహ్మదాపురంలో పోలింగ్స్టేషన్లు, వైన్‌షాపులను తనిఖీ చేశారు. నాంపల్లి మండలంలో నాంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్లు, మహ్మదాపురం గ్రామంలో ప్రభుత్వ ప్రాథమి కోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్లు, టాయిలెట్లు తనిఖీ చేశారు. పోలింగ్ సిబ్బంది బస చేసే విధంగా, ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేలా కనీస సౌకర్యాలు ఫర్నీచర్, లైటింగ్, వెబ్‌కాస్టింగ్, తాగునీరు, టాయిలెట్లు పరిశుభ్రం చేసి సిద్దం చేయాలని తహషీల్దార్ను ఆదేశించారు. నియోజకవర్గంలో 105 పోలింగ్ స్టేషన్లు క్రిటికల్ పోలింగ్ స్టేషన్లుగా గుర్తించినట్లు, ఈ పోలింగ్ స్టేషన్లలో వెబ్‌కాస్టింగ్‌తో పాటు మైక్రో అబ్జర్వర్లు నియమించినట్లు, పోలీస్‌శాఖ ద్వారా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. పోలింగ్ స్లిప్పుల పంపిణీపై అడిగి తెలుసుకున్నారు. 90శాతం పంపిణీ పూర్తయ్యిందని బీఎల్ఓలు కలెక్టర్‌కు తెలిపారు. పోలింగ్ స్లిప్పుల పంపిణీ త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నాంపల్లి మండలంలోని లకీ వైన్‌షాపులో తనిఖీ, ఆన్లైన్ విక్రయాలు గురించి అడిగారు.
పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు: మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు నల్గొండ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి పేర్కొన్నారు. నాంపల్లి, మాందాపురం పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. నాంపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల మూత్రశాలలో దుర్గంధం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా వెంటనే పోలింగ్ కేంద్రాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 298 పోలింగ్ కేంద్రాల్లో వెలుతురు ధారాలంగా ప్రసరించే పనులతో పాటు వెబ్ కాస్టింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఇబ్బందులు లేకుండా వసతుల కల్పనపై దృష్టి సారించామన్నారు. నిఘా వర్గాల సమాచారం మేరకు నియోజకవర్గ వ్యాప్తంగా 105 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి, వాటిపై ప్రత్యేక పరిశీలకులను నియమించినట్లు తెలిపారు. తహసీల్దార్ లాల్బహద్దూర్ పాల్గొన్నారు.
27 నుంచి పరిశీలన : మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో 80 ఏళ్లు దాటిన వృద్ధులతో పాటు వికలాంగులు మొత్తం ఇప్పటి వరకు 739 మంది బ్యాలెట్ ఓట్ల కోసం నమోదు చేసుకున్నారు. ప్రతి మండలానికి ఒక పోలింగ్ అధికారి నేతృత్వంలో 27, 28వ తేదీల్లో వీటిని రెండో విడత పరిశీలన కోసం అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు.
మునుగోడులో వంద చెక్ పోస్టుల ఏర్పాటు : మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో కేంద్ర బలగాలు, స్థానిక పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలోకి డబ్బు, మద్యం డంప్ కాకుండా వంద చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ సమీపిస్తుండడంతో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నల్గొండ జిల్లాలో 60, రాచకొండ పరిధిలో 40 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఒక్కో చెక్ పోస్టు వద్ద ఇద్దరు ఎస్ఐలు విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు రూ. 2 కోట్ల 65 లక్షల నగుదు, 1480 లీటర్ల మద్యం పట్టుబడింది. మునుగోడు ఉప ఎన్నికను పకడ్బందిగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.