గుంటూరు : అధికార భాషా సంఘం, తెలుగు & సంస్కృత అకాడమీలు రెండూ సమన్యయంతో , సమష్టి కృషితో పని చేసి తెలుగుభాష అభివృద్ధికి కృషి చేస్తాయని తెలుగు & సంస్కృత అకాడమీ అధ్యక్షులు డా॥నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. తాడేపల్లి ప్రైమ్ హిల్స్-అధికార భాషా సంఘం కార్యాలయంలో అధికార భాషా సంఘం సభ్యులు డా॥కత్తి వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో డా॥లక్ష్మీపార్వతి ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికార భాషా సంఘం సభ్యులుగా మంచి ప్రతిభ కలిగిన నలుగురు వ్యక్తుల్ని ఎంపిక చేశారన్నారు. ఛైర్మన్ పి.విజయబాబు ఎంతో సమర్థతతో భాషాసంఘాన్ని ముందుకు తీసుకుపోతున్నారన్నారు. ఆయనకు ఆలోచనలకు అనుగుణంగా నడిచి సంఘాన్ని బలోపేతం చేస్తూ తెలుగుభాషను కాపాడేందుకు, ఈ నలుగురు సభ్యులు కృషి చేస్తారన్న నమ్మకం కలుగుతోందన్నారు. కార్యక్రమంలో అధికార భాషా సంఘం సభ్యులు డా॥జి.రామచంద్రారెడ్డి, డా॥ మస్తానమ్మ, డా॥తవ్వ వెంకటయ్య, నవ్యాంధ్ర రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి కలిమిశ్రీ, ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కె.వేణుగోపాలరావు పాల్గొన్నారు. బాధ్యతల్ని స్వీకరించిన డా॥కత్తి వెంకట్వేర్లును పలువురు రచయితలు, భాషాభిమానులు అభినందనలు తెలియజేశారు.
అనంతరం అధికార భాషాసంఘం ఛైర్మన్ పి. విజయ్ బాబు సారధ్యంలో సంఘం సభ్యులందరూ పర్యాటక & సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్.కె.రోజాను మర్యాదపూర్వకంగా కలిశారు.