అమరావతి : ఏపీలో ఎక్కడ లేని టెన్షన్లూ అధికార వైసీపీలోనే కనిపిస్తున్నాయి. అందరి బాధ ఒక్కటిగా ఉంటే అధికార పార్టీ వారి బాధ పదింతలుగా ఉంటోంది. వారిది 2019 ఎన్నికల్లో గెలిచామన్న ఆనందం లేని బాధ.
ఆ తరువాత కరోనాతో రెండేళ్ళు ఏమీ కాకుండా అయ్యామన్న బాధ. ఇక ఎంతో ఖర్చు చేసి ఎమ్మెల్యేలుగా గెలిచినా కూడా గ్రౌండ్ లెవెల్ లో కనీసం పించన్ కానీ కార్డు కానీ ఇప్పించుకోలేక పోయామే అన్న బాధ. వీటికి మించి ఇపుడు గడప గడపకూ తిరగమంటూ ఎంత తిరుగుతున్నా గ్రాఫ్ బాలేదని అధినాయకత్వం ఎప్పటికపుడు హెచ్చరిస్తూండడంతో టికెట్ మీద డౌట్ అసలైన బాధ. ఇలా ఎన్నో బాధలతో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలకు ఇపుడు తాము సర్వేలలో ముందు వరసలో ఉన్నాం ఈసారికి టికెట్ గ్యారంటీ అని అనుకుంటున్న వేళ ఏపీలో తాజాగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు బెంబెలెత్తిస్తున్నాయి. ఏపీలో టీడీపీ జనసేన రెండూ కలసి ముందుకు సాగడం ఖాయమని తేలుతున్న సత్యం.
ఈ మేరకు చంద్రబాబు పవన్ కలసి ఒక ఉమ్మడి మీడియా మీటింగ్ కూడా నిర్వహించారు. పదే పదే ప్రజా సమస్యల మీద కలవాలని కూడా డిసైడ్ అయ్యారు. దాంతో గోదావరి ఉత్తరాంధ్రా జిల్లాల మీద ఈ కొత్త కలయిక ప్రభావం గట్టిగా ఉంటుందని అంటున్నారు. దాంతో ఇప్పటి దాకా 175 కి 175 సీట్లు మనకే వస్తాయని ధీమా పడిన వైసీపీ అధినాయకత్వం కొత్త వ్యూహాలకు పదును పెడుతుంది అని అంటున్నారు. ఆ విధగ్నా చూస్తే గోదావరి జిల్లాలలో బలమైన కాపు సామాజికవర్గాన్ని మచ్చిక చేసుకుంటూనే బీసీల మీద ఆధారపడి కొత్త రాజకీయం చేయాలని వైసీపీ అనుకుంటోందని చెబుతున్నారు.
ఎటూ కాపు ఓట్లలో అతి పెద్ద శాతం కచ్చితంగా జనసేన టీడీపీ కూటమికి వెళ్తాయని వైసీపీ హై కమాండ్ అంచనా వేస్తోంది. మరి ఆ ఓట్లను వేరే రూపంలో పొందాలీ అంటే బీసీల మీదనే కోటి ఆశలు పెట్టుకుంది అని అంటున్నారు. దాంతో గోదావరి ఉత్తరాంధ్రా జిల్లాలలో 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచిన అనేక నియోజకవర్గాలలో భారీ ఎత్తున మార్పుచేర్పులు ఉంటాయని అంటున్నారు. ఒక వేళ కాపు నేతలలో బలమైన వారు ఉన్నా బీసీలకు తొలి ప్రయారిటీ ఇస్తారని అంటున్నారు. అదే విధంగా గెలుపు గుర్రాలనే ఇప్పటిదాకా లెక్కేసుకున్నారు.
కానీ ఇపుడు సామాజిక సమీకరణలను కూడా అంచనా కట్టి ముందుకు సాగుతారు అని అంటున్నారు. దాంతో టోటల్ వైసీపీ లిస్ట్ చేంజ్ కాబోతోంది అన్న వార్తలే వైసీపీ ఎమ్మెల్యేల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయని అంటున్నారు. ఇక తమకే టికెట్ అని ధీమా పడిన వారంతా మొదటి లిస్ట్ కాదు రెండవ లిస్ట్ కూడా రెడీ అవుతోంది అన్న సమాచారంతో అలెర్ట్ అవుతున్నారు. దాంతో వారిలో ఎక్కడ లేని కంగారూ కూడా కనిపిస్తోంది అని అంటున్నారు. జనసేన టీడీపీ కలిస్తే అభ్యర్ధులను మార్పు చేయాలని వైసీపీ గట్టిగా డిసైడ్ కావడం రెండవ లిస్ట్ అని ప్రచారం జరుగుతుండడంతో ఎమ్మెల్యేలలో సరికొత్త టెన్షన్ పట్టుకుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.