బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీపై కన్నేసిన భారత్ రెండో టెస్టు తొలి రోజు అదరగొట్టింది. సీనియర్ పేసర్ షమీ, ఆల్‌రౌండ్ జడేజా, అశ్విన్ విజృంభించడంతో మొదటి రోజే ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది. 263 పరుగుల వద్ద ఆ జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఆట ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 21 రన్స్ చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (13), కేఎల్ రాహుల్ (4) వికెట్ పడకుండా నిదానంగా ఆడారు. కమిన్స్, మాధ్యూ కుహ్నెమన్, లయాన్ ఎంత ప్రయత్నించిన వికెట్ తీయలేకపోయారు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 242 పరుగులు వెనకబడి ఉంది. దాంతో, రెండో రోజు తొలి సెషన్ ఇరుజట్లకు కీలకం కానుంది.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాకు 50 రన్స్ వద్ద తొలి వికెట్ కోల్పోయింది. డేవిడ్ వార్నర్ మరోసారి (15) తక్కువ స్కోర్‌కే పెవిలియన్ చేరాడు. అయితే.. మరో ఓపెనర్ ఖవాజా (81) లబుషేన్‌తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించాడు. అయితే.. స్పిన్ మాత్రికుడు అశ్విన్ ఒకే ఓవర్లో లబుషేన్, స్మిత్‌ను ఔట్ చేసి ఆసీస్‌ను దెబ్బతీశాడు. హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. ట్రావిస్ హెడ్ (12), అలెక్స్ క్యారీ (0) నిరాశ పరిచాయి. 199కే 6 వికెట్లు కోల్పోయిన ఆసీస్ 263 స్కోర్ చేయగలిగిందంటే అందుకుకు కారణం.. స్పెషలిస్ట్ బ్యాటర్ హ్యాండ్స్కాంబ్ (72). ఒకవైపు వికెట్లు పడుతున్నా అతను పోరాడాడు. టెయిలెండర్లతో కలిసి జట్టు స్కోర్ 200 దాటించాడు. ఏడో వికెట్‌కు కమిన్స్, హ్యాండ్స్కాబ్ 59 రన్స్ జోడించారు. అయితే.. రవీంద్ర జడేజా ఒకే ఓవర్లో కమిన్స్, మర్ఫీని వెనక్కి పంపి ఆసీస్‌ను దెబ్బతీశాడు. ఆ తర్వాత షమీ చెలరేగాడు. లయాన్, కుహ్నెమన్‌ను బౌల్డ్ చేయడంతో ఆస్ట్రేలియా 263 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో షమీకి 4 వికెట్లు దక్కగా, అశ్విన్, జడేజా చెరో మూడు వికెట్లు తీసుకున్నారు.