విజయవాడ : బిబిసిపై కేంద్ర ప్రభుత్వ కక్షసాధింపు చర్యలకు నిరసనగా విజయవాడ
అలంకార్ సెంటరులోని ధర్నా చౌక్‌లో జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు.
రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్
ఫెడరేషన్ (ఎపిడబ్ల్యుజెఎఫ్), ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్స్
అసోసియేషన్ ఆధ్వర్యాన జరిగిన ఈ ధర్నాలో జర్నలిస్టులు ప్లకార్డులు, బ్యానర్
చేతబట్టి నినాదాలు చేశారు. నల్ల రిబ్బన్లు ధరించి నిరసన తెలిపారు. ‘కాపాడాలి..
మీడియా స్వేచ్ఛను, మానుకోవాలి..మీడియాపై కక్షసాధింపును, నిలుపుదల చేయాలి
బిబిసిపై దాడులను, కాపాడాలి భావ ప్రకటనా స్వేచ్ఛను” అని నినదిస్తూ ఆందోళన
నిర్వహించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ధర్నా గంటన్నరసేపు సాగింది.
ఈకార్యక్రమంలో ఎపిడబ్ల్యుజెఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.వెంకట్రావు
మాట్లాడుతూ 2002లో గుజరాత్లో జరిగిన మత మారణహోమంపై బ్రిటీష్ బ్రాడ్
కాస్టింగ్ కార్పొరేషన్ (బిబిసి) ఓడాక్యుమెంటరీని రూపొందించి ప్రసారం
చేసినందుకుగాను కేంద్ర ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పూనుకుందని
విమర్శించారు. ఇప్పటికే బిబిసి డాక్యుమెంట్ లింకులను సామాజిక మాధ్యమాల్లో
పెట్టడాన్ని నిషేధించిన కేంద్రం ఇప్పుడు నేరుగా ఆ వార్తా ఛానల్
కార్యాలయాలపైనే దాడులకు దిగిందన్నారు. ఢిల్లీ, ముంబయిల్లోని బిబిసి
కార్యాలయాల్లో ఆదాయ పన్ను అధికారులు సెర్చ్/సర్వే పేరుతో దాడులకు దిగడం
ద్వారా పత్రికా స్వేచ్ఛను హరిస్తోందన్నారు.
ఎపిడబ్ల్యుజెఎఫ్ విజయవాడ నగర అధ్యక్షులు కె. సాంబశివరావు (కలిమిశ్రీ)
అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్స్ ఫోరం రాష్ట్ర
ఉపాధ్యక్షులు అన్నవరపు బ్రహ్మయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం భావ ప్రకటనా
స్వేచ్ఛకు విఘాతం కలుగుకుండా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ఎపిబిజెఎ రాష్ట్ర
నాయకులు వీసం శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ వైఖరితో మీడియా
స్వేచ్ఛకు ప్రమాదం ఏర్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్
కె.గడ్డెన్న, నేషనల్ అలయెన్స్ ఆఫ్ జర్నలిస్ట్స్ (ఎన్‌ఎజె) కార్యదర్శి
ఓ.శాంతిశ్రీ, ఎపిబిజెఎ రాష్ట్ర నాయకులు హలీమ్, జి.వి.రంగారెడ్డి,
ఎపిడబ్ల్యుజెఎఫ్ రాష్ట్ర నాయకులు షేక్ ఖాజావలి, గోరంపట్లప్ప, విజయవాడ నగర
కార్యదర్శి ఎం.బి.నాథన్, నగర నాయకులు వి.హరినారాయణరాజు, బాషా, పశ్చిమ
నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు ఎన్.నరేంద్రకుమార్, వి.యు.ఫణికుమార్,
నాయకులు కె.శ్రీనివాస్‌తోపాటు వివిధ పత్రికలకు చెందిన జర్నలిస్టులు పెద్ద
సంఖ్యలో పాల్గొన్నారు.