అమరావతి : మనం చేసిన సామాజిక న్యాయం ప్రతి గడపకూ చేరాలని, సమ తూకం…సామాజిక
న్యాయం పాటించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
వైయస్సార్సీపీ స్థానిక సంస్థల కోటా సీట్లకు ఎమ్మెల్సీ అభ్యర్థులు, గవర్నర్
కోటాలో ప్రతిపాదిత వ్యక్తులతో సోమవారం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్
సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థులనుద్దేశించి మాట్లాడిన సీఎం
వైయస్.జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఎప్పుడూ చూడనంతగా, జరగనంతగా
సామాజిక న్యాయం అన్నది దేవుడి దయతో మన పార్టీలో మనం చేయగలుగుతున్నామని గర్వంగా
చెప్పుకునే గొప్ప పరిస్థితుల్లోకి వచ్చాం. ఇవాళ చాలా సుదీర్ఘంగా 18 మందిని
ఫైనలైజ్ చేస్తే వారిలో 14 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన వారు
కాగా 4 మాత్రమే ఇతరులు. ఇంత గొప్పగా సామాజిక న్యాయం ఎప్పుడూ జరగలేదు. గతంలో
ఎప్పుడూ జరగని విధంగా సామాజిక న్యాయాన్ని చేస్తున్నాం. దేవుడి దయతో మన
పార్టీలో మనం సామాజిక న్యాయాన్ని చేయగలుగుతున్నాం. ఈ విషయాన్ని మనం గర్వంగా
చెప్పుకోగలం. ఎమ్మెల్సీ పదవులకు 18 మంది పేర్లను ఖరారు చేశాం. వీరిలో 14 మంది
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించిన వారే ఉన్నారు. మిగిలిన సామాజిక వర్గాల
వారికి 4 సీట్లు ఇచ్చా. ఇందులో కూడా ఒక్కో సామాజిక వర్గానికి ఒక్కటి ఇచ్చాం.
మనం చేస్తున్న సామాజిక న్యాయం ప్రతి గడపకూ తెలియాలి, ప్రతి నియోజకవర్గంలో
చెప్పాలి. రాజకీయాల్లో ఇంత గొప్ప మార్పు ఎప్పుడూ జరగలేదు. పారదర్శకంగా బటన్
నొక్కి నేరుగా లబ్ధిదారులకు లంచాలకు తావులేకుండా పథకాలు అందిస్తున్నాం. విద్య,
వ్యవసాయం, ఆరోగ్య రంగాల్లో మంచి మార్పులు తెచ్చాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే
ఈరోజు మనం చేసిన సామాజిక న్యాయం మరో ఎత్తు. పదవులు తీసుకున్న వారు పార్టీని
బలోపేతం చేయాలి. పార్టీ నిర్దేశించిన కార్యక్రమాల్లో యాక్టివ్గా ఉండాలి. ఇది
చాలా ముఖ్యమైన అంశం. ఇటువంటి పరిస్థితుల్లో మనం కూడా అంతే ధీటుగా
యాక్టివ్గా పనిచేయడం ద్వారా మన వాణిని వినిపించాలి.
13–14 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఎమ్మెల్సీలుగా బాధ్యతలు తీసుకుంటున్న
వారు పార్టీకోసం ఏం చేయగలుగుతామో అన్న ఆలోచనతో అడుగులు వేయాలి. నేను
చేయాల్సింది నేను చేశాను. మీకు ఇవ్వాల్సిన పదవులు ఇచ్చాను. మీ దగ్గర నుంచి
పార్టీకి ఏ రకంగా మంచి చేయగలుగుతారు, ఏ రకంగా మంచి చేయాల్సిన బాధ్యత మీమీద
ఉందన్నది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది మీ తరపు నుంచి నేను కోరుతున్నాను.
మరింత ఉత్సాహంగా ఉండాలని అందరికీ తెలియజేస్తున్నాను. పదవులు పొందుతున్న
వారందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాంకాక్షలు తెలియజేస్తున్నానన్నారు. ఈ పదవులు
ఆశించిన వారు ఇంకా చాలా మంది ఉన్నారు. ఉన్న పదవులు తక్కువ, ఆశావహులు ఎక్కువగా
ఉంటారు కాబట్టి అందర్నీ సంతృప్తి పరచలేం. కొద్దో గొప్పో కొరత ఉంటుంది.
వీరందరికీ కూడా చెప్పే రీతిలో చెప్పుకుంటూ వారిని కన్విన్స్ చేసుకుంటూ
వెళ్లాలి.