రాజమండ్రి : రాజమండ్రి నగరం అన్నపూర్ణమ్మ పేటలో రైల్వే ఓవర్ బ్రిడ్జి
(ఆర్వోబీ) నిర్మాణానికి రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అన్నపూర్ణమ్మ
పేట లెవెల్ క్రాసింగ్ (ఎల్సీ) గేట్ వద్ద నిత్యం వందలాది ప్రజలు గేట్
దాటుతున్నారని, ప్రజలు కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారని, ఆర్వోబీ
నిర్మించాలని వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని
భరత్ రామ్ కేంద్ర రైల్వే శాఖ మంత్రికి చేసిన విజ్ఞప్తి చేశారు. దీనిపై
సానుకూలంగా స్పందించిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి తదనుగుణంగా నిర్ణయం
తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే అన్నపూర్ణమ్మ పేట ఎల్సీ గేటు దాటకుండా ఆర్వోబీ
నిర్మించాలని కేంద్ర రైల్వే శాఖ ఆదేశాల మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారుల
సూచనలపై పరిశీలించడానికి ఇక్కడకు వచ్చినట్టు బెజవాడ నార్త్ సీనియర్ డిన్ ఉన్నం
అక్కిరెడ్డి మీడియాకు తెలిపారు. అన్నపూర్ణమ్మ పేటలో రైల్వే ఓవర్ బ్రిడ్జి
(ఆర్వోబీ) నిర్మాణానికి తీసుకోవాల్సిన చర్యలు, నిర్ణయాలపై ఆయన ఎంపీ భరత్,
మున్సిపల్ కమిషనర్ కే దినేష్ కుమార్, ఇతర రైల్వే ఇంజినీర్లు, మున్సిపల్
అధికారులతో కలిసి సమగ్ర అధ్యయనం చేశారు. ఈ సందర్భంగా రైల్వే సీనియర్ డిన్
ఉన్నం అక్కిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇటీవల బెజవాడ-విశాఖల నుండి వెళుతున్న
రైళ్ళ వేగాన్ని 110 కేఎం నుండి 130 కేఎంకు పెంచారని, ఈ క్రమంలో లెవెల్
క్రాసింగ్ గేట్ల వద్ద ఆర్వోబీలు నిర్మించాలని కేంద్ర రైల్వే శాఖ
నిర్ణయించుకుందన్నారు. సౌత్ సెంట్రల్ రైల్వేకు ఎంపీ భరత్ ఇక్కడ ఆర్వోబీకి
ప్రాధాన్యత తెలియజేయడంతో శాంక్షన్ అయిందని సీనియర్ డిన్ ఉన్నం అక్కిరెడ్డి
తెలిపారు. డీపీఆర్ పథకంలో ఈ ఆర్వోబీ శాంక్షన్ అయిందని, కేంద్ర ప్రభుత్వమే
సమస్త ఖర్చులు భరిస్తుందన్నారు. కేవలం జిల్లా కలెక్టర్ అనుమతి ఇస్తే
చాలన్నారు. ఆర్వోబీ నిర్మాణానికి అవసరమైన స్థల సేకరణ, తొలగించాల్సిన భవనాలు
ఏమైనా ఉంటే వాటి యజమానులకు నష్టపరిహారం తదుపరి వ్యయాన్ని కేంద్ర రైల్వే శాఖే
మంజూరు చేస్తుందని రైల్వే సీనియర్ డిన్ అక్కిరెడ్డి వెల్లడించారు. ఈ వారంలోనే
నివేదిక పైకి పంపనున్నట్టు ఆయన చెప్పారు. ఎంపీ భరత్ మాట్లాడుతూ అన్నపూర్ణమ్మ
పేట స్లమ్ ఏరియాలో ఉండటం, జనాభా కూడా విపరీతంగా పెరగడంతో ఇక్కడ ఉన్న లెవెల్
క్రాసింగ్ గేట్ ను దాటే టప్పుడు ఆందోళన కలుగుతోందన్నారు. ఎల్సీ గేట్లు ఉన్న
చోట ఆర్వోబీ నిర్మాణానికి డీపీఆర్ స్కీమ్ రావడం అదృష్టమని అన్నారు. ఇక్కడ
ఆర్వోబీ నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంత ప్రజలకే కాకుండా నగర ప్రజలకు చాలా
సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. రైళ్ళ రాకపోకలు కారణంగా తరచూ ఎల్సీ గేట్ మూయడంతో
వాహనదారులకు చాలా సమయం వృధా అవుతోందని, అటువంటి పరిస్థితి ఆర్వోబీ నిర్మాణం
వల్ల ఇకపై తలెత్తదని ఎంపీ భరత్ తెలిపారు. 400 మీటర్ల పొడవు, 9.5 మీటర్ల
ఎత్తులో ఈ ఆర్వోబీ నిర్మాణం జరుగుతుందని రైల్వే అధికారులు తెలిపారని ఎంపీ భరత్
మీడియాకు తెలిపారు.