విజయవాడ : ఏ.పి.ఎస్.ఆర్.టి.సి. ఎం.డి సి.హెచ్. ద్వారకా తిరుమల రావు గురువారం
పల్నాడు జిల్లా లోని మాచర్ల, పిడుగురాళ్ళ డిపోలను, బస్ స్టేషన్లను
సందర్శించారు. డిపో లోని ప్రతి విభాగాన్ని పరిశీలించి, ఉద్యోగులతో
సంభాషించారు. అనంతరం బస్ స్టేషన్ల లోని ప్లాట్ ఫారం ల నిర్వహణ, బస్సుల
నిర్వహణ తదితర వాటిని గమనించి ప్రయాణికులకు కల్పిస్తోన్న సౌకర్యాలపై ఆరా
తీశారు. అదే క్రమంలో రెంటచింతల, గురజాల, దాచేపల్లి బస్ స్టేషన్లను కూడా
సందర్శించారు. దీనిలో భాగంగా మాచర్ల నుండి కేవలం 30 కిలోమీటర్ల దూరంలో గల
చారిత్రాత్మక కట్టడం బుద్ధవనం ను ఎం.డి. సి.హెచ్. ద్వారకా తిరుమల రావు,
సందర్శించారు. యాత్రికులు చూడదగ్గ ప్రదేశంగా, ఎంతో అందంగా బుద్ధవనం ప్రాజెక్ట్
అందర్నీ ఆకట్టుకునేలా తీర్చిదిద్దబడింది. అక్కడున్న నిర్వాహకులు, యాత్రికులు
ఎం.డి. గారిని కలిసి విజయవాడ, గుంటూరు తదితర ప్రదేశాల నుండి బుద్ధవనంకు
బస్సులు ఏర్పాటు చేస్తే సౌకర్యంగా ఉంటుందని అభ్యర్ధించారు. అంతేకాకుండా ఈ
బుద్ధవనంకి దగ్గరలో కేవలం 9 కిలోమీటర్ల దూరంలో నాగార్జున సాగర్, నాగార్జున
కొండ కూడా ఉన్నవి. కాబట్టి పర్యాటకులకు కనువిందు చేసేలా ఉండే ఈ ప్రాంతాలకు
బస్సు ఏర్పాటు చేయడం వలన ఆర్టీసీ అదనపు ఆదాయం పెంచుకునే అవకాశం కూడా ఉన్నందున
వారి అభ్యర్ధన మేరకు, బస్సు సౌకర్యం కల్పించడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని
అక్కడి అధికారులకు సూచించారు. చారిత్రాత్మక మైన ఈ బుద్ధవనం కట్టడం, అక్కడి
శిల్ప కళా నైపుణ్యం, లిపి, మ్యూజియం, ఆనాటిచరిత్ర యొక్క ప్రత్యేకత తదితర
అంశాలు విద్యార్ధులకు చాలా విజ్ఞానాన్ని, వినోదాన్ని అందిస్తాయి. విద్యార్ధులు
కూడా చూడదగ్గ ప్రదేశం కాబట్టి విహారయాత్ర కోసం వెళ్లాలనుకునే వారికి తక్కువ
ఛార్జీలతోనే బస్సులు ఏర్పాటు చేసేందుకు కూడా ఆర్టీసీ సిద్ధంగా ఉందని ఎం.డి.
తెలిపారు. త్వరలో ఏ.పి.ఎస్.ఆర్.టి.సి. ప్రవేశ పెట్టబోయే ఈ బస్సులని
స్కూల్/కాలేజి నిర్వాహకులు వినియోగించుకోవాలని ఆర్టీసీ విజ్ఞప్తి చేస్తుంది.