ఇప్పటికే 175 ఆలయాల్లో ఆన్ లైన్ ద్వారా అందుతున్న సేవలు
దేవాలయానికి సంబంధించిన పోర్టల్ ద్వారా మాత్రమే బుకింగ్ సదుపాయం
అవినీతి అరికట్టేందుకు విజిలెన్స్ సెల్ ఏర్పాటు
వివాదంలో ఉన్న 4,700 ఎకరాల అటవీ భూమి శ్రీశైలం దేవస్థానానికి చెందేలా చర్యలు
రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా హిందూ దేవాలయాల అభివృద్ధి
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ
విజయవాడ : వివాదంలో ఉన్న 4,700 ఎకరాల అటవీ భూమి శ్రీశైలం దేవస్థానానికి
చెందేలా చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు
సత్యనారాయణ వెల్లడించారు. శుక్రవారం విజయవాడ వన్ టౌన్ బ్రాహ్మణవీధిలోని
దేవాదాయ శాఖ క్యాంపు కార్యాలయంలో ఈ మేరకు మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ
ఏడాది 3,000 ఆలయాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుందని
అన్నారు. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో
ఎప్పుడూ జరగని విధంగా హిందూ దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు.
అభివృద్ధిలో భాగంగా ఒక్కో దేవాలయానికి రూ.10 లక్షల నిధులు
కేటాయిస్తున్నామన్నారు. ప్రాధాన్యత క్రమంలో ఒక్కో దేవాలయాన్ని
నిర్మించనున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 2,640 దేవాలయాలు రూ.10 లక్షల నిధులు
కేటాయించే స్కీమ్ లో ఉన్నాయన్నారు. కొత్తగా 1,568 దేవాలయాలు నిర్మించాలని
వచ్చిన ప్రతిపాదనలను శ్రీవాణి ట్రస్ట్ అంగీకరించిందన్నారు. 936 దేవాలయాల్లో
భూములు అందుబాటులో ఉన్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. శ్రీశైలంలో భూ
కేటాయింపులకు తగినట్లుగా ఆదాయం రావడం లేదని, ఈ నేపథ్యంలో కొత్త పాలసీని
తీసుకురావాలని నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు. టెండర్ లకు సంబంధించి 18
మంది ప్రతిపాదనలు పెట్టుకున్నారన్నారు. టెండర్ ప్రతిపాదనల సమయంలోనే నిబంధనలకు
అనుగుణంగా ఆమోదించిన ప్రణాళిక ను అందజేయాలని సూచించారు. శ్రీశైలం అభివృద్ధికి
సంబంధించి అటవీ శాఖ, రెవెన్యూ శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు, అధికారులతో
చర్చించామన్నారు. దేవాదాయ భూములకు సంబంధించిన విషయంలో ఇప్పటికే డీమార్కేషన్
చేసి 1:2 నిష్పత్తిలో మార్పులు చేశామన్నారు. ఆలయ భూముల సరిహద్దులకు సంబంధించి
ఫెన్సింగ్ వేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. శ్రీశైలం చరిత్రలో ఇదొక గొప్ప
విజయమన్నారు. శ్రీశైలంలో ఏపీఎస్ ఆర్టీసీ డిపో కోసం ఇప్పటికే 4 ఎకరాలు
కేటాయించామన్నారు. వినియోగంలోకి వచ్చాక వేరే ఏవైనా ప్రతిపాదనలు వస్తే
తప్పకుండా ఆలోచిస్తామన్నారు.
శ్రీశైలం దేవస్థాన ఆధ్వర్యంలోకి కుల సత్రాలను తెస్తామన్నారు. వాటిపై దేవస్థానం
పర్యవేక్షణ ఉండేలా కొత్త విధానం తెస్తున్నామని తెలిపారు. పాత సత్రాలకు
సంబంధించిన అంశాలపై త్వరలోనే సమావేశం అవుతామన్నారు.
ఏపీలోని అన్ని దేవాలయాల్లో ఆన్ లైన్ సేవలు: తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోనే
ప్రతి దేవాలయంలో క్యూలైన్లలో నీటి వసతి, మజ్జిగ పంపిణీ, ప్రసాదం, టాయిలెట్ల
సౌకర్యం ఉండే విధంగా ఏర్పాట్లు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికే
రాష్ట్రంలో 175 దేవాలయాల్లో ఆన్ లైన్ సేవలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
టెంపుల్ మేనేజ్మెంట్ సిస్టం ద్వారా ఈ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని
మంత్రి వెల్లడించారు.