2014తో పోలిస్తే ఐదు రెట్లు ఎక్కువగా కేటాయింపులు
వరి, గోధుమల దగ్గరే ఆగిపోవద్దు
‘వ్యవసాయం-సహకార సంఘాలు’ అంశంపై బడ్జెట్ అనంతర వెబినార్‌లో ప్రధాని నరేంద్ర
మోడీ
న్యూఢిల్లీ : వ్యవసాయ రంగంలో ఆత్మనిర్భరతే ప్రభుత్వ లక్ష్యమని, దిగుమతుల
ద్వారా విదేశాలకు తరలిపోతున్న సంపదను రైతులకు చేరేలా చేయడమే తమ కర్తవ్యమని
ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ‘వ్యవసాయం-సహకార సంఘాలు’ అంశంపై
బడ్జెట్ అనంతర వెబినార్‌లో మాట్లాడిన మోదీ పలు అంశాలను ప్రస్తావించారు.
2014కి ముందు బడ్జెట్లో వ్యవసాయానికి రూ.25 వేల కోట్లు కేటాయించగా ప్రస్తుతం
దాన్ని 1.25 లక్షల కోట్లకు చేర్చామని గుర్తుచేశారు. ఇటీవల తాము
ప్రవేశపెడుతున్న ప్రతి బడ్జెట్‌కూ ‘ఇది గ్రామాలు, పేదలు, రైతుల కోసం వచ్చిన
బడ్జెట్’ అని ప్రశంసలు దక్కుతున్నాయని తెలిపారు. చాలా కాలంగా వ్యవసాయరంగం
నిర్లక్ష్యానికి గురయిందని, దీంతో 2021-22 నాటికి వ్యవసాయ దిగుమతుల విలువ
సుమారు రూ.2 లక్షల కోట్లకి చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస మద్దతు ధర,
నూనె గింజల సాగుకు ప్రోత్సాహకాలు, ఆహారశుద్ధి పరిశ్రమల ఏర్పాట్లకు చర్యలు
తీసుకోవడం ద్వారా ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
వరి, గోధుమల దగ్గరే ఆగిపోవద్దు : వ్యవసాయ రంగంలో భారత్‌ను ఆత్మనిర్భర్‌గా
మార్చడమే కాకుండా ఎగుమతుల దేశంగా మారేలా కృషి చేస్తున్నందుకు రైతులకు మోదీ
కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో రైతులు తమ ఉత్పత్తులను
అమ్ముకునేందుకు వీలు కల్పిస్తున్నామన్నారు. అయితే ఈ ఎగుమతులు గోధుమ, వరి వద్దే
ఆగిపోకూడదని సూచించారు. 2023ను చిరుధాన్యాల సంవత్సరంగా గుర్తించినందున వాటిని
పండించే చిన్న, సన్నకారు రైతులకు ఇది సువర్ణావకాశమని తెలిపారు. ప్రైవేటు
పెట్టుబడులు వ్యవసాయరంగంలోకి రాకపోవడం యువతను ఈ రంగానికి దూరంగా ఉంచుతోందని
అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం 3వేలకు పైగా అగ్రి అంకుర సంస్థలున్నాయని ఇవి మరింత
పెరగాలని సూచించారు. వ్యవసాయరంగంలో డ్రోన్ల వాడకం, సాంకేతికత వినియోగం, అంకుర
సంస్థల ఏర్పాటు, శ్రీఅన్న (చిరుధాన్యాలు) తదితర అంశాలపై తమ ప్రభుత్వ విధానాలను
ప్రధాని వివరించారు.