ఈసారీ ఇంటర్ మార్కులకు వెయిటేజీ లేదు
బీఎస్సీ నర్సింగ్‌లో ప్రవేశాలకు ఎంసెట్‌లో ఉత్తీర్ణత తప్పనిసరి
హైదరాబాద్ : ఎంసెట్, పీజీ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష (పీజీఈసెట్)ల
దరఖాస్తు ప్రక్రియ మార్చి 3 నుంచి మొదలుకానుంది. సంబంధిత నోటిఫికేషన్లను ఈ
నెల 28న విడుదల చేయనున్నారు. దరఖాస్తుల కాలపట్టికను రాష్ట్ర ఉన్నత విద్యామండలి
ఛైర్మన్ ఆర్.లింబాద్రి, జేఎన్టీయూహెచ్ ఉపకులపతి నర్సింహారెడ్డి, ఎంసెట్
కన్వీనర్ డీన్‌కుమార్, పీజీఈసెట్ కన్వీనర్ రవీందర్‌రెడ్డి
జేఎన్టీయూహెచ్లో విడుదల చేశారు. మే 7 నుంచి 11 వరకు ఎంసెట్, మే 29 నుంచి
జూన్ 1 వరకు పీజీఈసెట్ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. కార్యక్రమంలో
రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యదర్శి శ్రీనివాస్‌రావు, ఎంసెట్, పీజీఈసెట్
కోకన్వీనర్లు విజయకుమార్‌రెడ్డి, సురేష్‌బాబు పాల్గొన్నారు.
ఎంసెట్ మార్కులతోనే ర్యాంకు : గత మూడేళ్లుగా ఇంటర్ మార్కులకు 25 శాతం
వెయిటేజీ ఇవ్వడం లేదని, ఈసారి కూడా ఉండదని ఉన్నత విద్యామండలి ఛైర్మన్
లింబాద్రి తెలిపారు. ‘‘ఎంసెట్ మార్కులతోనే ర్యాంకు ఇస్తాం. అందుకు ప్రభుత్వం
ఆమోదం తెలిపింది. జేఈఈ మెయిన్, నీట్, ఇతర ఏ ప్రవేశ పరీక్షల్లోనూ ఇంటర్
మార్కులకు వెయిటేజీ ఇవ్వడం లేదు. ఇతర రాష్ట్రాల్లో విధానాన్ని నిపుణుల కమిటీతో
పరిశీలించి తెలంగాణ ఎంసెట్‌లో వెయిటేజీని తొలగించాం. ప్రస్తుతానికి ఈ ఒక్క
ఏడాది విషయంలోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. కరోనా కారణంగా 2020 నుంచి ఇంటర్లో
పర్సంటేజీతో సంబంధం లేకుండా ఇంజినీరింగ్, ఇతర కోర్సుల్లో ప్రవేశాలకు
అనుమతించాం. ఈసారి ఇంటర్మీడియట్లో ఎస్సీ, ఎస్టీలకు 40 శాతం, ఇతరులకు 45 శాతం
మార్కులు తప్పనిసరి. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 70 శాతం సిలబస్ ఆధారంగానే
ఎంసెట్‌లో ప్రశ్నలు ఇస్తాం. రెండో ఏడాదిలో మాత్రం 100 శాతం సిలబస్ ఉంటుంది.
పూర్తి సిలబస్‌ను త్వరలో వెబ్సైట్లో ఉంచుతాం. బీఎస్సీ నర్సింగ్‌లో
చేరాలనుకున్న విద్యార్థులు ఎంసెట్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగం పరీక్ష
తప్పనిసరిగా రాసి అర్హత సాధించాలి. ఈ మేరకు కాళోజీ వైద్య విశ్వవిద్యాలయం మాకు
లేఖ రాసిందని లింబాద్రి వివరించారు.
ఎంసెట్ నిర్వహణకు తెలంగాణలో 16 పరీక్షా జోన్లు ఏర్పాటు చేస్తారు. ఏపీలో
విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కర్నూలు నగరాల్లో ఈ పరీక్షలు
నిర్వహిస్తారు.
ఎంసెట్ దరఖాస్తుల కాలపట్టిక
ఈ నెల 28: నోటిఫికేషన్ జారీ
మార్చి 3- ఏప్రిల్ 10 వరకు: ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తుల సమర్పణ
ఏప్రిల్ 12-14 వరకు: దరఖాస్తుల్లో తప్పుల సవరణకు అవకాశం
ఏప్రిల్ 15- మే 2 వరకు: రూ.250 నుంచి రూ.5 వేల వరకు ఆలస్య రుసుముతో
దరఖాస్తుకు అవకాశం
ఏప్రిల్ 30 నుంచి: డౌన్లోడ్ చేసుకోవడానికి వెబ్సైట్లో హాల్‌టికెట్ల
అందుబాటు
ఎంసెట్ పరీక్షలు : మే 7, 8, 9 తేదీల్లో ఇంజినీరింగ్; 10, 11 తేదీల్లో
అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ
దరఖాస్తు చేసుకునేందుకు వెబ్సైట్: www.eamcet.tsche.ac.in
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.500, ఇతరులకు రూ.900