హర్మన్‌ప్రీత్ కౌర్ వైరల్ వీడియోపై అనుష్క శర్మ స్పందన..
ఉమెన్ టీ20 వరల్డ్ కప్ నుంచి భారత్ నిష్క్రమించింది. నువ్వానేనా అన్నట్టు
అత్యంత ఉత్కంఠగా సాగిన సెమీస్ ఫైట్‌లో పోరాడి ఓడింది. ఐదే ఐదు పరుగుల తేడాతో
భారత్‌పై గెలిచి ఫైనల్‌కి ఆసీస్ చేరింది . చివరి వరకు పోరాడి ఓడిన ఈ
మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుతమైన పోరాట పటిమ
కనబరిచింది. ఓ వైపు అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ హర్మన్ ఈ మ్యాచ్‌లో చివరి
వరకు పోరాడింది. అయితే కీలక సమయంలో ఆమె దురదృష్టకర రీతిలో రనౌట్‌తో వెనుదిరగడం
మొత్తం మ్యాచ్‌ను టర్న్ చేసింది. అయితే ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత
హర్మన్‌ప్రీత్ తీవ్ర భావోద్వేగాన్ని ఆపులోకపోయింది. ఆట ముగిసిన తర్వాత
మ్యాచ్ ప్రెజెంటేషన్ సమయంలో సన్‌గ్లాసెస్ పెట్టుకుని హర్మన్ కనిపించింది .
అయితే, గ్లాసెస్ ఎందుకు ధరించావని హర్మన్‌కు ప్రెజెంటేటర్ వేసిన ప్రశ్నకు
ధీటైన సమాధానం చెప్పింది . “నేను ఏడుస్తుంటే నా దేశం చూడకూడదనుకుంటున్నాను.
అందుకే నేను ఈ అద్దాలు ధరించాను. మేము ఖచ్చితంగా మెరుగవుతాం. మరోసారి దేశాన్ని
నిరాశపర్చబోమని నేను మాటిస్తున్నాను” అని హర్మన్‌ప్రీత్ చెప్పింది. ఆమె
చెప్పిన ఈ సమాధనానికి దేశ వ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి.
బాలీవుడ్ నటి అనుష్క శర్మ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లోకి వెళ్లి,
ఆస్ట్రేలియాతో భారత్ ఓడిపోయిన తర్వాత కన్నీళ్లను దాచుకోవడానికి భారత కెప్టెన్
హర్మన్‌ప్రీత్ కౌర్ నల్లటి సన్ గ్లాసెస్‌లో చూపించిన వైరల్ వీడియోపై
స్పందించింది. ఈరోజు వీడియోకు సంబంధించి అనుష్క ఒక వార్తా కథనాన్ని పోస్ట్
చేసింది. “మీ గురించి, మీ జట్టు కెప్టెన్ గురించి ఎల్లప్పుడూ గర్వంగా ఉంది”
అని క్యాప్షన్‌లో రాసింది. అలాగే టీమిండియా జెర్సీని సూచిస్తూ క్రికెటర్‌ను
ట్యాగ్ చేసింది.
ఆమె సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో ఐసీసీ టీ20 వరల్డ్ కప్ అధికారిక
హ్యాండిల్ ద్వారా భాగస్వామ్యం చేయబడిన వీడియోను పోస్ట్ చేసింది. హృదయపూర్వక
ఎమోజీలతో “ఈ మహిళలు” అని కూడా జోడించింది. సెమీ ఫైనల్లో ఓడిపోవడంతో
హర్మన్‌ప్రీత్‌ని ఓదార్చడాన్ని భారత మాజీ కెప్టెన్ అంజుమ్ చోప్రా ఈ వీడియోలో
చూపించింది.