కర్నూలు : ఉమ్మడి కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం
చేయడమే లక్ష్యంగా మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన
రాజేంద్రనాథ్‌రెడ్డి రంగంలోకి దిగారు.
పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఇంట్లో ఎమ్మెల్యేలతో
సమావేశమయ్యారు. వైసీపీ సమన్వయకర్తలు కడప జడ్పీ చైర్మన్ ఆకేపాటి
అమర్నాథ్రెడ్డి, మాజీ మంత్రి రాంసుబ్బారెడ్డి కూడా హాజరయ్యారు. ఈ ఎమ్మెల్సీ
స్థానానికి వైసీపీ అభ్యర్థి డాక్టర్ ఎ.మధుసూదన్, టీడీపీ సహకారంతో ఏపీ
సర్పంచుల సంఘ రాష్ట్ర కార్యదర్శి భూమా వెంకటవేణుగోపాల్‌రెడ్డి, జిల్లా
అధ్యక్షుడు కె.శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడు నర్ల మోహన్‌రెడ్డిలు స్వతంత్రులుగా
నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. కె.శ్రీనివాసులును ప్రతిపాదిస్తూ సంతకాలు
చేసిన బేతంచర్లకు చెందిన ఇద్దరు టీడీపీ కౌన్సిలర్లను అర్థరాత్రి బలవంతంగా
తీసుకెళ్లి తమ సంతకాలు ఫోర్జరీ చేశారని రిటర్నింగ్ అధికారి, జేసీ
రామ్‌సుందర్‌రెడ్డికి ఫిర్యాదు చేయించడంతో ఆయన నామినేషన్‌ను పరిశీలనలోనే
తిరస్కరించారు.
భూమా వేణుగోపాల్‌రెడ్డి, నర్ల మోహన్‌రెడ్డి అజ్ఙాతంలోకి వెళ్లారు. విత్‌డ్రాకు
27వ తేదీ వరకు గడువు ఉంది. ఈలోగా ఆ ఇద్దరితో విత్‌డ్రా చేయించాలని
ఎమ్మెల్యేలకు మంత్రులు పెద్దిరెడ్డి, బుగ్గన ఆదేశాలు జారీ చేసినట్లు
తెలిసింది. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను
గెలిపించేందుకు వ్యూహ రచనపైనా చర్చించినట్లు సమాచారం. కోడుమూరు, నందికొట్కూరు,
కర్నూలు నియోజకవర్గాల్లో ముఖ్య నాయకుల మధ్యనే విభేదాలు ఉన్నాయని, వాటిని వీడి
సమన్వయంతో పనిచేయకపోతే అధిష్టానం చూస్తూ కూర్చోదని హెచ్చరించినట్టు తెలిసింది.
ఇన్నాళ్లు ఒక లెక్క.. ఇప్పుడొక లెక్క.. అంటూ వైసీపీ నాయకులకు గట్టిన
వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఈ సమావేశానికి కర్నూలు ఎమ్మెల్యే అఫీజ్‌ఖాన్,
శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గైర్హాజరవడం గమనార్హం.