పలాసలో చేపట్టిన 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి 2023 మార్చి నాటికి పూర్తిచేస్తాం
రూ.742 కోట్లతో చేపట్టిన ఉద్దానం సురక్షిత మంచినీటి ప్రాజెక్టు 2023 మార్చి కల్లా సిద్దం
కిడ్నీవ్యాధికారకాలను గుర్తించేందుకు జిఐజిహెచ్, టిఇఆర్ఐ, ఐసిఎంఆర్ తో త్రైపాక్షిక ఒప్పందం
వచ్చే వారంలో మద్యంతర నివేదికను అందజేయనున్న బృందం
రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య శాఖ మంత్రి విడదల రజిని
అమరావతి : శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్య సేవలు అందజేయడంలో జగనన్న ప్రభుత్వం యుద్ద ప్రాతిపధికన చర్యలను తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం మరియు వైద్య విద్య శాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. 75 ఏళ్ల సమస్య పరిష్కారానికి జగనన్న ప్రభుత్వం గత మూడేళ్ల నుండి అవిశ్రాంతంగా కృషిచేస్తున్నదని, ఈ సమస్య పరిష్కారానికి గత ప్రభుత్వం చేసింది శూన్యం అని ఆమె స్పష్టంచేశారు. బుధవారం అమరావతి సచివాలయం నాల్గో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో పాత్రికేయులతో ఆమె మాట్లాడుతూ 2019 లో జగనన్న ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్దానం కిడ్నీ సమస్య పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. మూత్ర పిండాల వ్యాధి గ్రస్తులకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో 2019 సెప్టెంబర్ మాసంలో రూ.50 కోట్ల అంచనా వ్యయంతో పలాసాలో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణాకి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారన్నారు. ఈ ఆసుపత్రి నిర్మాణ పనులు 75 శాతం పైబడి పూర్తి అయ్యాయని, వచ్చే ఏడాది మార్చి మాసానికల్లా ఈ ఆసుపత్రి సేవలు అందుబాటులోకి రానున్నట్టు ఆమె తెలిపారు. అదే విధంగా ఉద్దాన ప్రాంతంలోని ఇచ్చాపురం, కవిటి, సోంపేట, కంచిలి, మందస, పలాస మరియు వజ్రపుకొత్తూరు తదితర ఏడు మండలాల్లోని నివాశిత ప్రాంతాల ప్రజలకు సురక్షితమైన త్రాగునీటిని సరఫరా చేయాలనే లక్ష్యంతో రూ.742 కోట్ల అంచనా వ్యయంతో సర్పేస్ వాటర్ ప్రాజెక్టు నిర్మాణానికి జగనన్న ప్రభుత్వమే శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. ఈ ప్రాజెక్టు పనులు కూడా 80 శాతం వరకూ పూర్తి అయ్యాయని, వచ్చే ఏడాది మార్చి నాటికల్లా ఈ ప్రాజెక్టు అందుబాటులోకి రానున్నట్లు ఆమె తెలిపారు. ఉద్దాన ప్రాంతంలోని అన్ని గ్రామాలకు 142 ఆటోమేటెడ్ వాటర్ డిస్పెన్సర్ల ద్వారా 24 గంటలూ సురక్షిత త్రాగునీటి పంపిణీచేస్తున్నామన్నారు. ఉద్దానం ప్రాంతంలోని కిడ్నీవ్యాధికారకాలను గుర్తించేందుకు జార్జి ఇన్ స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ (జిఐజిహెచ్), న్యూడిల్లీకి చెందిన టిఇఆర్ఐ, ఐసిఎంఆర్ తో త్రైపాక్షిక ఒప్పందం చేసుకోవడం జరిగిందన్నారు. వచ్చే వారంలో ఈ బృందం ప్రభుత్వానికి తమ మద్యంతర నివేదికను అందజేయనున్నట్లు ఆమె తెలిపారు.
రెగ్యులర్ గా స్క్రీనింగ్స్ …మెరుగైన వైద్య సేవలు : ఉద్దాన ప్రాంతంలోని ఇచ్చాపురం, కవిటి, సోంపేట, కంచిలి, మందస, పలాస మరియు వజ్రపుకొత్తూరు మండలాల్లోని 18 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, 5 ప్రాధమికోన్నత ఆరోగ్య కేంద్రాలు మరియు 6 సామాజిక ఆరోగ్య కేంద్రాలలో మూత్రపిండాల వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్య సేవలను అందించడం జరుగుచున్నదని మంత్రి తెలిపారు. ప్రాధమిక దశలోనే దీర్ఝకాలిక మూత్రపిండాల వ్యాధి గ్రస్తులను గుర్తించి వారికి అవసరమైన ఔషదాలను అందించాలనే ఉద్దేశ్యంతో ఉద్దానం ప్రాంతంలో రెగ్యులర్ గా స్క్రీనింగ్ చేయడం జరుగుచున్నదన్నారు. ఇప్పటి వరకూ 1 లక్షా 25 వేల 506 మందికి స్క్రీనింగ్ లు పూర్తిచేసి, 21,861 మందికి వైద్య సేవల నిర్వహణ మరియు 791 మందికి డయాలసిస్ సేవలను అందజేయడం జరుగుచున్నదని ఆమె తెలిపారు. సీరం క్రియాటిన్, రక్తం యూరియా స్థాయిలను పరీక్షించేందుకు సెమీ ఆటో ఎనలైజర్స్ తో 17 లేబొరేటరీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ సంబందిత అధికారులతో సమగ్ర సమీక్ష అనంతరం అదనంగా మరో 11 ఎనలైజర్స్ కొనుగోలుకు చర్యలను చేపట్టడం జరిగిందన్నారు. కవిటి, సోంపేట, పలాస, హరిపురం సి.హెచ్.సి.లు, టెక్కలి జిల్లా ఆసుపత్రిలో 65 డయాలసిస్ మెషిన్స్ తో 5 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేసి కిడ్నీ వ్యాధిగ్రస్తులకు డయాలసిస్ సేవలను అందజేయడం జరుగుచున్నదని ఆమె తెలిపారు. డా.వైఎస్సార్ పించను కానుక క్రింద 3,4 దశల్లోని వ్యాధిగ్రస్తులకు రూ.5 వేలు, డయాలసిస్ చేయించుకుంటున్న వారి రూ.10 వేలను ప్రభుత్వం ప్రతి మాసం కిడ్నీ రోగులకు అందజేస్తున్నది ఆమె తెలిపారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, కమిషనర్ జె.నివాస్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.