న్యూఢిల్లీ : మనం ఎంత శ్రమించినా మన ప్రయత్నానికి దేవుడి ఆశీస్సులు కూడా ఉండాలన్నారు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. అందుకోసం ప్రధాని నరేంద్ర మోడీకి ఓ అభ్యర్థన చేశారు. కొత్త కరెన్సీ నోట్లపై మహాత్ముడి చిత్రంతో పాటు లక్ష్మి, విఘ్నేశ్వరుడి దేవతా రూపాలను ఉంచాలని కోరారు. ‘కొత్త కరెన్సీ నోట్లపై ఒకవైపు మహాత్మా గాంధీ చిత్రాన్ని, మరోవైపు దేవతా మూర్తులు లక్ష్మి, గణేశుడి రూపాలను ఉంచొచ్చు. దేవతల చిత్రాలు ఉంచడం వల్ల దేశం అభివృద్ధి మార్గంలో పయనిచేందుకు ఉపయోగపడుతుంది. మనం శ్రమించినా.. దైవం ఆశీస్సులు లేకపోతే మన ప్రయత్నాలు ఫలించవు. అందుకే నోట్లపై వారి రూపాలు చిత్రించాలని ప్రధానిమోదీని అభ్యర్థిస్తున్నాను. ఇండోనేషియాలో ముస్లిం జనాభా అధికంగా ఉన్నప్పటికీ ఆ దేశ నోట్లపై గణేశుడి చిత్రం ఉంటుంది. ఇండోనేషియానే చేయగలిగినప్పుడు.. మన వల్ల ఎందుకు కాదు..? డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ క్షీణిస్తుండటంతో దేశం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. దేశ ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించేందుకు మన ప్రయత్నాలతో పాటు దేవుడి ఆశీస్సులు కూడా అవసరమని వ్యాఖ్యానించారు. దీనిపై త్వరలో ప్రధాని మోడీ కి లేఖ రాస్తానని వెల్లడించారు.
కేజ్రీవాల్ కొత్త ముసుగు ధరించారు: బీజేపీ
‘దేవుళ్ల గురించి ఆప్ నేతల మాటతీరు వేరేగా ఉండేది. వారు ఇంకా పార్టీలోనే కొనసాగుతున్నారు. ఎన్నికల వేళ ఇప్పుడు కొత్త యత్నాలు చేస్తున్నారు. రామ మందిరాన్ని వ్యతిరేకించిన వారు, కశ్మీరీ పండిట్ల వలసలు అబద్ధమని వ్యాఖ్యానించినవారు ఇప్పుడు కొత్త ముసుగు ధరించారు. ప్రస్తుతం కేజ్రీవాల్ రాజకీయాలు యూ టర్న్ తీసుకుంటున్నాయని బీజేపీ నేతలు కేజ్రీవాల్ సూచనను తీవ్రంగా విమర్శించారు.