విజయవాడ : బీసీలకు సామాజిక న్యాయం చేసిన ఘనత సీఎం జగన్‌దే అని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. విజయవాడలో గురువారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన బీసీల ఆత్మగౌరవ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. బీసీలకు సీఎం జగన్ చేసిన న్యాయం మరెవరూ చేయలేదు. అన్ని పదవుల్లో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చారు. తద్వారా సామాజిక న్యాయం పాటించారు. బీసీలకు ఒక గుర్తింపు ఇచ్చిన పార్టీ వైఎస్సార్సీపీ. వైఎస్సార్సీపీ తరపున ఆర్.కృష్ణయ్య లాంటి బీసీ నాయకుడిని రాజ్యసభకు పంపాం. సామాజిక సాధికారతకు న్యాయం చేసిన ఘనత సీఎం జగన్‌దే అని సజ్జల పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఏనాడూ బీసీలను పట్టించుకోలేదు. కానీ, సీఎం జగన్ బీసీల ఆకాంక్షలకు పెద్దపీట వేశారు. విద్య, వైద్యమే ఏ కుటుంబానికైనా అతిముఖ్యం. అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. ఆర్థికంగా నిలబడేందుకు అన్ని వర్గాలకు అండగా నిలిచాం. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే డబ్బులు జమ చేస్తున్నాం. మూడున్నరేళ్ల కిందట రాష్ట్రం ఎలా ఉండేదో సీఎం జగన్ పాలనలో రాష్ట్రంలో ఎలా ఉందో ఆలోచించాలని ప్రజలకు సజ్జల పిలుపు ఇచ్చారు.