అమరావతి : మేము అమలు చేస్తున్నవి కేవలం ఉచిత పథకాలు కాదు. ఇదంతా మానవ వనరుల
మీద పెడుతున్న పెట్టుబడిగా మేం భావిస్తున్నామని సీఎం వైఎస్
జగన్మోహన్రెడ్డి అన్నారు. మానవ వనరుల నైపుణ్యాభివృద్ధిగానే చూస్తున్నాం.
ప్రభుత్వం అలా ఆలోచించకపోతే ప్రగతి సాధించలేం. మా విద్యార్థులు సొంత కాళ్ల మీద
నిలబడి, ఉన్నత స్థానాలకు ఎదగడానికి అవసరమైన వనరులను సమకూరుస్తున్నాం. అందుకోసం
విద్యా ప్రమాణాలు పెంపొందిస్తున్నాం. అభివృద్ధిలో వారిని భాగస్వాములను
చేస్తున్నాం. ‘పరిశ్రమలు నెలకొల్పడానికి అన్ని విధాలా అనువైన వాతావరణం, వనరులు
మన రాష్ట్రంలో ఉన్నాయి. 974 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం, నిరంతరాయమైన
విద్యుత్ సరఫరా, కొత్తగా ఏర్పాటవుతున్న 4 పోర్టులు, నాణ్యమైన వనరులు..
ఇవన్నీ పరిశ్రమల ఏర్పాటుకు అత్యంత అనుకూలమైన అంశాలు. పోర్టు ఆధారిత పరిశ్రమలకు
రాష్ట్రం అత్యంత ఆకర్షణీయం. ఇక్కడ గ్రీన్ ఎనర్జీ రంగంలో అపార అవకాశాలున్నాయి.
దేశంలో 11 పారిశ్రామిక కారిడార్లు రాబోతుంటే అందులో మూడు మన రాష్ట్రంలోనే
వస్తున్నాయి. మూడు పారిశ్రామిక కారిడార్లున్న ఏకైక రాష్ట్రం కూడా మనదే’ అని
సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. విశాఖపట్నంలో శుక్రవారం నుంచి
రెండు రోజుల పాటు జరిగే ‘గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్’ నేపథ్యంలో
బుధవారం ఆయన కొందరు జాతీయ మీడియా ప్రతినిధులతో ప్రత్యేకంగా మాట్లాడారు.
పెట్టుబడికి ఉన్న అవకాశాలను, పరిశ్రమల ఏర్పాటుకున్న అనుకూలతలను
పారిశ్రామికవేత్తలకు వివరించడం ద్వారా ఈ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడం
సదస్సు లక్ష్యం. పరిశ్రమల ఏర్పాటుకు అత్యంత సానుకూల వాతావరణం రాష్ట్రంలో ఉంది.
ప్రభుత్వం తొలి నుంచీ స్నేహపూర్వక పారిశ్రామిక విధానంతో ముందుకు వెళుతోంది. ఏ
రాష్ట్రంలోనైనా పరిశ్రమలు నెలకొల్పాలంటే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు,
ప్రోత్సహకాలు ఇవ్వటం సహజం.
6 పోర్టులున్నాయి. కొత్తగా 4 పోర్టులు నిర్మిస్తున్నాం. అందులో 3 పోర్టులను
ప్రభుత్వమే సొంత నిధులతో నిర్మిస్తోంది. పోర్టు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు
రాష్ట్రం అత్యంత అనుకూలం.
పారిశ్రామిక వేత్తల అభిప్రాయాలు తీసుకుని, వాటి ప్రకారం ప్రో యాక్టివ్గా
వ్యవహరిస్తున్నాం. అందుకే ఈ రాష్ట్రంవైపు ఎప్పుడూ చూడని అంబానీ, బిర్లా,
అదానీ, బంగూర్, బజాంకా, దాల్మియా వంటి వారు ఇప్పుడు రాష్టంలో పెట్టుబడులు
పెట్టడానికి ముందుకొస్తున్నారు. గతంలో ఇంతమంది దిగ్గజ పారిశ్రామికవేత్తలు
రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చింది లేదు. 2021–22లో 11.43 శాతం
వృద్ధిరేటుతో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో నిలిచింది.
మూడు రంగాల్లో విప్లవాత్మకమైనమార్పులు : ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా గత
ప్రభుత్వ తప్పులను కొన్నింటిని సరిచేస్తుంది, కొన్ని కొత్త కార్యక్రమాలు
ప్రారంభిస్తుంది. మేం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఆసుపత్రులు, పాఠశాలలు,
వ్యవసాయం.. ఈ రంగాల్లో పూర్తి స్థాయిలో విప్లవాత్మక చర్యలు చేపట్టాం. రాష్ట్ర
చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ‘నాడు–నేడు’ పేరిట ప్రభుత్వాసుపత్రులు, ప్రభుత్వ
పాఠశాలలను ఆధునీకరిస్తున్నాం. ప్రాథమిక విద్యా రంగంలో ‘అమ్మ ఒడి’ పథకం ఓ
విప్లవం.