విజయవాడ : పేదల ఆర్థికాభివృద్ధే వైఎస్సార్ సీపీ ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా
అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని ప్లానింగ్
బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. గురువారం
64 వ డివిజన్ 284 వ వార్డు సచివాలయ పరిధిలో నిర్వహించిన గడప గడపకు మన
ప్రభుత్వం కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ యరగొర్ల తిరుపతమ్మతో కలిసి ఆయన
పాల్గొన్నారు. ప్రజాశక్తి నగర్లో విస్తృతంగా పర్యటించి.. 176 గడపలను
సందర్శించారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాల లబ్ధిని ఆయా కుటుంబాలకు
వివరించి సంక్షేమ క్యాలెండర్ ను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది
విష్ణుని ప్రాంత ప్రజలు ఆప్యాయంగా పలకరించారు, కర్పూర హారతులు పట్టారు.
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు తమ జీవితాల్లో వెలుగులు
నింపుతున్నట్లు వెల్లడించారు. గతంలో తాము ఎదుర్కొన్న సమస్యలను, ఈ ప్రభుత్వంలో
జరుగుతున్న మేలును వివరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే తమ
సంపూర్ణ మద్దతు ఇస్తామని తెలియజేశారు. గుమ్మంగుమ్మంలో సంక్షేమం
వెల్లివిరుస్తుండటంతో ఎక్కడికి వెళ్ళినా ప్రజలంతా తమను సాదరంగా
ఆహ్వానిస్తున్నారని మల్లాది విష్ణు తెలిపారు. ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి
తీసుకువెళ్లడానికి.. ప్రతి పేద కుటుంబ ఆర్థిక పరిపుష్టికి గడప గడపకు మన
ప్రభుత్వం ఎంతగానో దోహదపడుతోందన్నారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలు అడిగి
తెలుసుకున్నారు. స్థానిక సమస్యలపై చర్చించి పరిష్కారానికి తీసుకోవాల్సిన
చర్యలపై సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
అభివృద్ధిలో రాజీ పడే ప్రసక్తి లేదు : అభివృద్ధి విషయంలోనూ ఎక్కడా రాజీ పడే
ప్రసక్తి లేదని మల్లాది విష్ణు తెలిపారు. గడప గడపకు మన ప్రభుత్వంలో భాగంగా
గుర్తించిన సమస్యల పరిష్కారానికి ప్రతి సచివాలయానికి రూ. 20 లక్షలు నిధులు
కేటాయించారని చెప్పారు. సచివాలయ పరిధిలో ఈ నిధులతో ప్రజాశక్తినగర్ ప్రధాన
రహదారిని నిర్మించనున్నట్లు వివరించారు. కండ్రిక నుంచి పాతపాడు వరకు రహదారి
నిర్మాణానికి త్వరలోనే టెండర్లను ఆహ్వానించి పనులు ప్రారంభిస్తామని
తెలియజేశారు. అలాగే 22ఏ కింద నిషేధిత జాబితాలో ఉన్న భూములను డీనోటిఫై చేయాలని
నిర్ణయించడంతో నున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలోని కండ్రిక,
ఎన్.ఎస్.సి.బోస్ నగర్, పాయకాపురం పరిసర ప్రాంతాలలో పెండింగ్ లో ఉన్న వేలాది
అర్జీలకు పరిష్కారం లభించనుందని వివరించారు. ప్రజల ఆశీస్సులు తమ ప్రభుత్వానికి
మెండుగా ఉన్నాయని, ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా సంక్షేమం, అభివృద్ధి
ఆగదని స్పష్టం చేశారు. మరోవైపు రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే
లక్ష్యంగా ఈనెల 3, 4 తేదీల్లో విశాఖలో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్
సమ్మిట్-2023 విజయవంతమై రాష్ట్రానికి భారీగా ఎంఓయూలు జరగాలని, యువతకు
పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు లభించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.