విశాఖపట్నం : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం
నేటి నుంచి రెండు రోజుల పాటు శుక్ర, శనివారాల్లో విశాఖలో ప్రతిష్టాత్మకంగా
నిర్వహించనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 ఆంధ్రప్రదేశ్ లో
పెట్టుబడులను ఆకర్షించేందుకు గొప్ప వేదికని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ
ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ట్విట్టర్ వేదికగా ఈ మేరకు
గురువారం ఆయన పలు అంశాలను వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి విశ్వాసంతో
చేస్తున్న ప్రయత్నాలు అలాగే ప్రజలు అందిస్తున్న సహకారం దేశవ్యాప్త, ప్రపంచ
వ్యాప్త పెట్టుబడిదారులకు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు, తమ వ్యాపారాలు
ఆంధ్రప్రదేశ్ లో విస్తరించేందుకు ప్రేరేపిస్తాయిని అన్నారు. అందరం కలిసి
సమిష్టిగా అభివృద్ధి చెందుదాం అన్నదే జీఐఎస్ నినాదమని అన్నారు.
జీఐఎస్ కు తరలివస్తున్న పారిశ్రామిక దిగ్గజాలు
విశాఖ జీఐఎస్ కు పారిశ్రామిక దిగ్గజాలు తరలివస్తున్నారని విజయసాయి రెడ్డి
అన్నారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు ప్రత్యేక అతిథులుగా అంబానీ, బిర్లా,
అదానీ, బజాజ్, జిందాల్, భజాంకా, దాల్మియా, బంగర్ తదితరులు ప్రత్యేక
ఆహ్వానితులుగా వస్తున్నారని తెలిపారు. వాస్తవ పెట్టుబడులే లక్ష్యంగా గ్లోబల్
ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గురువారం సాయంత్రం నాటికి
రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారి సంఖ్య 12000 దాటిందని, ఈ సంఖ్య మరింత
పెరగనుందని అన్నారు.
ముఖ్యమంత్రి స్వాగతం పలికిన విజయసాయి రెడ్డి
నేటి నుంచి రెండు రోజుల పాటు విశాఖలో నిర్వహించనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్
సమ్మిట్-2023 లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
గురువారం సాయంత్రం విశాఖ చేరుకున్నారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ఆయన్ని
విమానాశ్రయంలో కలిసి పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు.