మాస్కో : ఉక్రెయిన్‌కు అండగా నిలుస్తోన్న పాశ్చాత్య దేశాలపై రష్యా తాజాగా మరోసారి విరుచుకుపడింది. కీవ్ దళాలకు సాయం అందించేందుకు వినియోగిస్తోన్న పాశ్చాత్య వాణిజ్య ఉపగ్రహాలనూ తాము లక్ష్యంగా చేసుకుని, నాశనం చేయగలమని ఓ సీనియర్ రష్యన్ దౌత్యవేత్త హెచ్చరించారు. ఉక్రెయిన్ యుద్ధం కొన్నాళ్లుగా తీవ్రరూపం దాల్చుతోంది! మాస్కో బలగాల దాడులను జెలెన్స్కీ సేనలు సైతం దీటుగా ఎదుర్కొంటున్నాయి. వారి క్షిపణులను నేలకూల్చుతున్నాయి. ఈ క్రమంలోనే.. యుద్ధక్షేత్రంలో ఉక్రెయిన్‌కు అండగా నిలుస్తోన్న పాశ్చాత్య దేశాలపై రష్యా ) తాజాగా మరోసారి విరుచుకుపడింది. కీవ్ దళాలకు సాయం అందించేందుకు వినియోగిస్తోన్న పాశ్చాత్య వాణిజ్య ఉపగ్రహాలనూ తాము నాశనం చేయగలమని ఓ సీనియర్ రష్యన్ దౌత్యవేత్త హెచ్చరించారు.
ఉక్రెయిన్ యుద్ధ కార్యకలాపాలకు పాశ్చాత్య ఉపగ్రహాలను వినియోగించడం అత్యంత ప్రమాదకర చర్యగా రష్యా విదేశాంగశాఖ సీనియర్ అధికారి కాన్స్టాంటిన్ వోరోంత్సోవ్ పేర్కొన్నారు. ఉక్రెయిన్‌కు మద్దతుగా ఇటువంటి ఉపగ్రహాలను ఉపయోగించడం రెచ్చగొట్టే పనేనని మండిపడ్డారు. అమెరికా, దాని మిత్రదేశాలకు చెందిన వాణిజ్య, ఇతర పౌర అంతరిక్ష సదుపాయాల గురించి మేం మాట్లాడుతున్నాం. ప్రతీకార దాడులకు వాటినీ చట్టబద్ధ లక్ష్యాలుగా పరిగణించే అవకాశం లేకపోలేదని వోరోంత్సోవ్ ఐరాస ఫస్ట్ కమిటీకి తెలిపారు. అమెరికా, ఇతర దేశాలు తమ ఉపగ్రహాల సాయంతో రష్యా సేనల కదలికలను నమోదు చేయడం, ఛాయాచిత్రాలు తీయడం, రియల్ టైంలో సమాచారాన్ని సేకరించడం వంటివి చేస్తున్నాయని రష్యా ఆరోపిస్తోంది. మరోవైపు ఉక్రెయిన్‌కు అందిస్తోన్న ఉచిత ఇంటర్నెట్ సేవలను కొనసాగిస్తామని ‘స్పేస్ఎక్స్’ అధినేత ఎలాన్ మస్క్ ఇటీవల తెలిపారు. స్టార్‌లింక్ సాయంతో శత్రువుల కదలికలను కనిపెట్టి దాడులు చేయగలిగామని ఉక్రెయిన్ సైన్యం ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో రష్యా దౌత్యవేత్త వ్యాఖ్యలు కీలకంగా మారాయి.