విజయవాడ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మూడున్నరేళ్లలో
ప్రజాదరణ వెయ్యి రెట్లు పెరిగిందని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్
ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సోమవారం 64 వ డివిజన్ 285 వ వార్డు సచివాలయ
పరిధిలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్
యరగొర్ల తిరుపతమ్మతో కలిసి ఆయన హాజరయ్యారు. కండ్రికలో విస్తృతంగా పర్యటించి
264 గడపలను సందర్శించారు. ఈ సందర్భంగా స్థానికులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం
పలికారు, మహిళలు హారతులు పట్టారు. మూడున్నరేళ్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి
ప్రభుత్వంలో ప్రతి ఇంటికి చేసిన మేలును గడప గడపలో పుస్తక రూపంలో మల్లాది
విష్ణు వివరించారు. సచివాలయ పరిధిలో 1,229 ఇళ్లు ఉండగా 3,580 మంది జనాభా
ఉన్నట్లు తెలిపారు. వీరిలో 2,446 మంది లబ్ధిదారులకు ఇప్పటివరకు 7 కోట్ల 40
లక్షల 7వేల 87 రూపాయల సంక్షేమాన్ని అందించినట్లు చెప్పారు. నవరత్నాల పథకాల
ద్వారా ప్రభుత్వం అందించే సాయాన్ని జీవనోపాధి మార్గాలను మెరుగుపరుచుకునేందుకు
వినియోగించుకోవాలని సూచించారు. అలాగే తమ నివాసాలు శిథిలావస్థకు చేరిన పలువురు
స్థానికులు ప్రభుత్వ సాయం కోసం కోరగా ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ. లక్షా
80 వేల ఆర్థిక సాయాన్ని అందిస్తుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని
ఎమ్మెల్యే తెలియజేశారు.
సత్ఫలితాలనిస్తోన్న సంక్షేమ పథకాలు : పేదరిక నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం
ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తున్నాయని మల్లాది విష్ణు
తెలిపారు. నగదు బదిలీ సహా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక
సంస్కరణలను ఆర్థిక నిపుణులు సైతం కీర్తిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా
లబ్ధిదారు అవ్వరు కోటేశ్వరమ్మ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పింఛన్ కోసం గంటల
తరబడి క్యూ లైన్లలో నిరీక్షించాల్సి వచ్చేదని, ఈ ప్రభుత్వంలో ఇంటి వద్దకే
వచ్చి అందజేస్తున్నట్లు తెలిపారు. కొప్పుల శివపార్వతి మాట్లాడుతూ వైఎస్సార్
ఆసరా, వాహనమిత్ర, సున్నావడ్డీ, అమ్మఒడి వచ్చినట్లు చెప్పారు. మరో లబ్ధిదారు
షేక్ హుస్సేన్ సాహెబ్ మాట్లాడుతూ తన కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల
ద్వారా రూ. 7.83 లక్షల లబ్ధి చేకూరిందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతిఒక్క
పేద కుటుంబానికి ఏదో ఒక పథకం రూపంలో చేకూరుతున్న మేలును చూసి జీర్ణించుకోలేక
ప్రతిపక్షాలన్నీ కుట్ర రాజకీయాలు చేస్తున్నాయని మల్లాది విష్ణు మండిపడ్డారు.
పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ విధానం వినూత్నం, ఆదర్శం : పెట్టుబడుల ఆకర్షణలో
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం వినూత్నం, ఆదర్శమని ప్లానింగ్
బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు అన్నారు. విశాఖలో జరిగిన గ్లోబల్
ఇన్వెస్టర్స్ సమ్మిట్ విజయవంతం కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. కేవలం
రెండు రోజుల వ్యవధిలో లక్ష్యానికి మించి రూ. 13.41 లక్షల కోట్ల విలువైన 378
ఒప్పందాలు కుదుర్చుకోవడం సంతోషదాయకమన్నారు. వీటి ద్వారా 6.09 లక్షల మందికి
ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు వెల్లడించారు.