మహబూబ్‌నగర్ : తెరాస, బీజేపీ లు పరస్పరం సహకరించుకుంటున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. ‘అవి నాణేనికి బొమ్మ, బొరుసులాంటివి. ఆ పార్టీలకు కాంగ్రెస్ సమదూరంలో ఉంది’ అని అన్నారు. దేశంలో ద్వేషం, హింస రోజు రోజుకూ పెరిగిపోతున్నాయన్నారు. భారత్ జోడో యాత్ర గురువారం 50వ రోజు పూర్తి చేసుకుంది. ఆదివారం రాష్ట్రంలో ప్రారంభమై వాయిదా పడగా తిరిగి గురువారం నారాయణపేట జిల్లా మక్తల్ సమీపం నుంచి ఉ. 6.15 గంటలకుప్రారంభమైంది. రాహుల్ పాదయాత్రలో భారీగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాసంఘాల నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. మార్గంలో రాహుల్ బీడీ కార్మికులు, పాఠశాల స్వీపర్లతో ప్రత్యేకంగా సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతులకు సంబంధించిన కుటుంబాల వారితో, కౌలు రైతులతో యాత్రకు ముందు మక్తల్ మండలం బొందలకుంట సమీపంలోని శిబిరంలో ఆయన మాట్లాడారు. ధన్వాడ మండలం ఎమ్నోన్పల్లి వద్ద ప్రసంగించారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ చూడని అవినీతిని చూస్తున్నామన్నారు.
తెలంగాణ ప్రజలు చూపుతున్న ప్రేమ మరువలేనిది : ‘‘ఎమ్మెల్యేల కొనుగోలు అంశం సిగ్గుచేటు. తెరాస, భాజపాలు రాజకీయ పార్టీలుగా కాకుండా ఫక్తు వ్యాపార సంస్థలుగా వ్యవహరిస్తున్నాయి. దేశంలో ప్రధాని మోడీ , రాష్ట్రంలో కేసీఆర్‌ల దుష్టపాలన సాగుతోంది. దిల్లీలో బీజేపీ కి తెరాస, రాష్ట్రంలో తెరాసకు బీజేపీ మద్దతు ఇచ్చిపుచ్చుకుంటున్నాయి. పార్లమెంటులో రైతు వ్యతిరేక బిల్లులకు తెరాస మద్దతు ఇచ్చింది. రెండూ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పని చేస్తున్నాయి. అవి ప్రజల సొమ్మును దోచుకుంటున్నాయి. రాష్ట్రంలోని తెరాస ప్రభుత్వం దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం. రూ.15 వేల కోట్ల మియాపూర్ భూ కుంభకోణంపై విచారణ పూర్తి చేయలేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో అడ్డగోలుగా అవినీతి చేశారు. ఇంత చేసినా ఇప్పటి వరకు ఆ ప్రాజెక్టు పూర్తి కాలేదు. దేశంలో, రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరుగుతోంది. నోట్ల రద్దు, జీఎస్టీతో చిన్న, మధ్యతరహా వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలతో సామాన్యులపై భారం పడుతోంది. సమస్యలను వెలుగులోకి తేవడానికే జోడో యాత్రను చేపట్టా. తెలంగాణ ప్రజలు ఈ యాత్రకు ఇస్తున్న ప్రోత్సాహం, చూపుతున్న ప్రేమ మరువలేనివి. క్లిష్టమైన 3,500 కిలోమీటర్ల యాత్రను ఈ ఆదరాభిమానాలతో సునాయాసంగా పూర్తి చేస్తా’’ అని రాహుల్ అన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నేతలు మధుయాస్కీ, సంపత్‌కుమార్, వంశీచంద్‌రెడ్డి తదితరులు ఆయనతో కలిసి నడిచారు.