వెలగపూడి సచివాలయం : ఈ నెల 3, 4 తేదీల్లో విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్
ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో రాష్ట్ర పర్యాటక రంగానికి సంబందించి రూ.21,941 కోట్ల
పెట్టుబడులతో 129 ఒప్పందాలు జరిగాయని, వీటి ద్వారా 41,412 మందికి ఉద్యోగ,
ఉపాధి అవకాశాలు కలుగనున్నాయని రాష్ట్ర పర్యాటక, క్రీడలు, యూత్ అడ్వాన్సుమెంట్
& సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్.కె.రోజా తెలిపారు. ఈ మద్యే ఉత్తర ప్రదేశ్,
పంజాబ్, రాజస్తాన్, కర్ణాటకల్లో జరిగిన పెట్టుబడుల సదస్సుల్లో కూడా పర్యాటక
రంగానికి సంబందించి ఇంత భారీ స్థాయిలో పెట్టుబడులు రాలేదని ఆమె అన్నారు.
రాష్ట్ర పర్యాటక రంగంలో ఇంత భారీ స్థాయిలో పెట్టుబడులు వచ్చేందుకు
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ ఇమేజే ప్రధాన కారణమని ఆమె తెలిపారు.
మంగళవారం వెలగపూడిలోని ఆంద్రప్రదేశ్ సచివాలయం నాల్గో బ్లాక్‌లోని పబ్లిసిటీ
సెల్ లో ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్
ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఎంతో విజయవంతం అయిందంటూ కేక్ ను కట్ చేసి ఆమె
సంతోషాన్ని వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద పెద్ద
పారిశ్రామిక వేత్తలు ఈ సదస్సుకు హాజరవ్వడమే కాకుండా రూ.13.41 లక్షల కోట్ల
పెట్టుబడులతో భారీఎత్తున ఒప్పందాలు జరిగాయని తద్వారా 6.09 లక్షల మందికి
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగనున్నట్లు ఆమె తెలిపారు. ప్రముఖ పారిశ్రామిక
వేత్తలు అయిన అంబానీ, అధానీ, దాల్మియా, ఒబెరాయ్, జిఎంఆర్ వంటి అతిరథ మహారధులు
ఈ సదస్సుకు హాజరవ్వడం జరిగిందన్నారు. రాష్ట్రంలోని పారిశ్రామిక అవకాశాలను,
రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానాన్ని వారు ఎంతో గొప్పగా చెప్పడమే కాకుండా
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు రాష్ట్ర పారిశ్రామిక అభివృద్దిలో మేమూ
పాలు పంచుకుంటామని వారంతా ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమర్థవంతమైన
పాలన అందజేస్తున్న ఫలితంగా రాష్ట్ర జి.ఎస్.డి.పి. గ్రోత్ 2022 లో 11.43 శాతం
రావడమే కాకుండా ఈజ్ ఆఫ్ డూయింట్ బిజినెస్ గత మూడేళ్ల నుండి ప్రథమ స్థానంలో
నిలవడం, ఎగుమతుల్లో నాల్గో స్థానంలో, రెలిజియస్ టూరిజంలో ప్రధమ స్థానంలోను,
జనరల్ టూరిజంలో మూడవ స్థానంలోను నిలవడం జరిగిందన్నారు. ఇటు వంటి సమర్థవంతమైన
పాలన అందజేస్తున్న జగన్మోహన్ రెడ్డి పై పూర్తి నమ్మకం, విశ్వాసంతోనే
పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున రాష్ట్రానికి తరలి రావడం జరిగిందన్నారు.
రాష్ట్ర పర్యాటక రంగానికి సంబందించి రూ.21,941 కోట్ల
పెట్టుబడులతో జరిగిన మొత్తం 129 ఒప్పందాలను సాద్యమైనంత త్వరగా అమలు పర్చి
ఏడాది కాలంలోనే వాటన్నింటినీ గ్రౌండ్ అయ్యేలా చూసేందుకు కార్యాచరణ
ప్రణాళికను ఇప్పటికే రూపొందించుకోవడమే కాకుండా పర్యాటక శాఖ పరంగా పర్యాట
శాఖ స్పెషల్ సి.ఎస్. మరియు ఏపి టూరిజం డెవలెమ్మెంట్ కార్పొరేషన్ ఎం.డి.
స్థాయిల్లో రెండు కమిటీలను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె తెలిపారు.