ప్రతి గ్రామం రూపురేఖలు మార్చాలన్న ధ్యేయంతో అడుగులు ముందుకేస్తున్నాం
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి
నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరులో జెన్కో మూడో యూనిట్‌ను జాతికి అంకితం చేసిన సీఎం జగన్ మోహన్ రెడ్డి
పొట్టి శ్రీరాములు నెల్లూరు : తన తండ్రి వైఎస్సార్ శ్రీకారం చుట్టిన ప్రాజెక్ట్‌ను ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరులో జెన్కో మూడో యూనిట్‌ను సీఎం ప్రారంభించారు. అనంతరం కృష్ణపట్నం పోర్టు పరిధిలో చేపల వేటకు అనువుగా రూ.25 కోట్ల వ్యయంతో ఫిషింగ్ జెట్టి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తిలో నేడు మరో ముందడుగు పడిందని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన జెన్కో మూడో యూనిట్‌ను జాతికి అంకితం చేస్తున్నామన్నారు. ‘‘వ్యవసాయానికి పగటిపూట 9 గంటల విద్యుత్ సరఫరాకు చర్యలు చేపట్టాం. ప్రాజెక్ట్‌కు భూములిచ్చిన రైతులకు ధన్యవాదాలు. 326 కుటుంబాలకు ఇప్పటికే ఉద్యోగాలు ఇచ్చాం. మరో 150 కుటుంబాలకు నవంబర్‌లో ఉద్యోగాలు ఇస్తామని’’ సీఎం అన్నారు. గతంలో ఓట్ల కోసం చంద్రబాబు తప్పుడు హామీలు ఇచ్చారు. 16,218 మత్స్యకారేతర కుటుంబాలకు 35.74 కోట్ల సాయం అందించాం. స్థానికుల కోసం రూ.25 కోట్లతో ప్రత్యేక జెట్టీ నిర్మిస్తున్నాం.ప్రజలందరికీ మంచి చేయాలన్న ఉద్దేశంతో ముందడుగు వేశామని సీఎం జగన్ అన్నారు. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్సార్ 2008లో ఈ విద్యుత్‌ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు. దేశంలో తొలిసారిగా ప్రభుత్వరంగంలో సూపర్ క్రిటికల్ థర్మల్‌పవర్ స్టేషన్‌కు ఆనాడు వైఎస్సార్ శ్రీకారం చుట్టారు. ఇవాళ పూర్తిసామర్థ్యంతో మనం ప్రారంభించడం దేవుడు ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను. వినియోగదారులకు రోజంతా నాణ్యమైన కరెంటు సరఫరాకు అన్నిచర్యలూ తీసుకుంటున్నాం. ఈ థర్మల్ పవర్ స్టేషన్‌కు మన ప్రభుత్వంలో అక్షరాల రూ.3,600కోట్లు ఇచ్చాం. రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో దాదాపు 45 శాతం కరెంటు ప్రభుత్వరంగ విద్యుత్ సంస్థలు ఉత్పత్తిచేస్తున్నాయి. ఈరోజు జాతికి అంకితం చేసిన ఈ ప్లాంట్ నుంచి రోజుకు 19 మిలియన్ యూనిట్లు గ్రిడ్‌కు అనుసంధానం అవుతుంది. తక్కువ బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల వెలువడే కాలుష్యం తగ్గుతుందని సీఎం పేర్కొన్నారు. కృష్ణపట్నంతో పాటు, విద్యుత్ ప్రాజెక్టులకు భూములు ఇచ్చిన రైతులందరికీ కూడా నిండు మనస్సుతో అభివాదం తెలియజేస్తున్నానాని సీఎం పేర్కొన్నారు.
ఇది వరకే 326 కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చాం. రెండో దశలో 150 కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియ పూర్తవుతుంది. నవంబర్ మాసం పూర్తయ్యేలోగానే ఈ ఉద్యోగాలను కల్పిస్తాం. ఎన్నికల వేళ మీ అందరికీ ఇచ్చిన హామీని కూడా ఇవాళ అమలు చేస్తున్నాను. ఐదేళ్లలో మేలు చేయకపోయినా ఎన్నికలు వచ్చేసరికి చంద్రబాబు హడావిడిగా వచ్చి మోసం చేస్తున్నారని మీరు నా దృష్టికి తీసుకు వచ్చారు. నేను విన్నాను.. నేను ఉన్నాను.. అని ఆరోజే చెప్పాను. ఆ మాటను నిలబెట్టుకుంటూ ఇవాళ 16,337 మత్స్యారేతర కుటుంబాలు మొత్తం అందరికీ కూడా బటన్ నొక్కి నేరుగా రూ.36 కోట్లు వారి బ్యాంకు ఖాతాల్లోకి జమచేస్తున్నానని సీఎం అన్నారు. ఆ రోజు హడావిడిగా చంద్రబాబు మోసం చేసే ఉద్దేశంతో కేవలం 3500 మందికి, అదికూడా కేవలం రూ.14వేలుచొప్పున కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితి. వీరి క్కూడా మిగిలిన డబ్బు కూడా ఇస్తున్నాం.
నెల్లూరు జిల్లాలో పెన్నానది మధ్యలో ముదివర్తి పాలెం వద్ద సబ్మెర్జబుల్ చెక్‌డ్యాం నిర్మాణంకోసం రూ.93 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నాం. దీనివల్ల సముద్రంనుంచి వచ్చే బ్యాక్ వాటర్‌ను ఆపగలుగుతాం. నాలుగు మండలాలకు నీటి సమస్యను కూడా తీర్చగలుగుతాం. శాసనసభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అడిగిన మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నాం. ఈ మధ్యకాలంలో నెల్లూరు బ్యారేజీని కూడా ప్రారంభించడం జరిగింది. నెల్లూరు బ్యారేజీకి కూడా నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి పేరుకూడా పెడుతున్నాం. మరో ప్రాజెక్టుకు కూడా శంకుస్థాపన చేశాం. ఈ ప్రాంత మత్స్యకారులకోసం రూ.25 కోట్లతో ప్రత్యేక జట్టీని నిర్మిస్తున్నాం. ప్రతి ఇంటికీ మంచి చేయాలన్న తపనతో అడుగులు వేస్తున్నాం. ప్రతి గ్రామం రూపురేఖలు మార్చాలన్న ధ్యేయంతో అడుగులు ముందుకేస్తున్నాం. దేవుడి దయ, మీ అందరి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలిని సీఎం పేర్కొన్నారు.