న్యూఢిల్లీ : దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థ 8 ఏళ్ల క్రితం కుప్పకూలే స్థితిలో
ఉండేదని, ఇప్పుడు తమ ప్రభుత్వం ధైర్యంగా తీసుకున్న నిర్ణయాల కారణంగా లాభాల
బాటలో పయనిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఈ వ్యవస్థ బలోపేతమైన
కారణంగా వచ్చిన ఫలితాలను చిట్టచివరి వ్యక్తివరకూ అందించేందుకు ప్రయత్నించాలని
పిలుపునిచ్చారు. తాజా బడ్జెట్ ద్వారా దేశవ్యాప్తంగా సానుకూల వాతావరణం
నెలకొందని, దానిని ఉపయోగించుకుని గరిష్ఠ ప్రయోజనాలు పొందే బాధ్యత అందరిపై
ఉందని పేర్కొన్నారు. ఆర్థిక రంగంపై జరిగిన బడ్జెట్ అనంతర వెబినార్లో
ప్రధాని మాట్లాడారు. ‘కరోనా సమయంలో భారత్ అనుసరించిన ఆర్థిక, మానిటరీ విధానాల
ప్రభావాన్ని ఇప్పుడు ప్రపంచం మొత్తం చూస్తోంది. గత తొమ్మిదేళ్లుగా భారత ఆర్థిక
వ్యవస్థ పునాదులను బలోపేతం చేయడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల ఫలితమే
ఇది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఇప్పుడు భారత్ మంచి స్థానంలో ఉంది. 2021-22లో
ఇదివరకు ఎన్నడూలేనంత గరిష్ఠ స్థాయిలో ఎఫ్డీఐలనూ సాధించింది. 8-10 ఏళ్ల క్రితం
కుప్పకూలే స్థితిలో ఉన్న బ్యాంకింగ్ వ్యవస్థ ఇప్పుడు లాభాల్లోకి వచ్చింది.
ప్రస్తుతం మీముందు ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం ఉంది. అందువల్ల
మీరందరూ ముందడుగువేసి వేగంగా పని చేయాలి. పూచీకత్తు ఏమీ లేకుండానే 20
లక్షలమందికిపైగా ముద్ర రుణాలు అందాయి. పీఎం స్వనిధి ద్వారా తొలిసారి 40 లక్షల
మంది వీధి వ్యాపారులు, చిన్న దుకాణదారులు బ్యాంకుల నుంచి సాయం పొందగలిగారు.
చిన్న స్థాయి వ్యాపారులపై వడ్డీభారాన్ని తగ్గించి, వేగంగా రుణాలు అందించడానికి
ఇప్పుడున్న విధాన ప్రక్రియను పూర్తిగా ప్రక్షాళించాలి. ఈ విషయంలో సాంకేతికత
ఉపయోగపడుతుంది. బడ్జెట్ తర్వాత పన్నుల గురించి విస్తృత చర్చ జరిగేది. కానీ
ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. జీఎస్టీ, ఆదాయ పన్ను, కార్పొరేట్
పన్ను తగ్గింపు కారణంగా భారత్లో పన్నుల భారం భారీగా తగ్గింది. ఫలితంగా
ప్రజలపైనా భారం తగ్గుతూ వస్తోంది.
2013-14లో మన స్థూల పన్ను ఆదాయం రూ.11 లక్షల కోట్లు ఉంటే 2023-24 నాటికి అది
రూ.33 లక్షల కోట్లకు చేరింది. సుమారు 200% పెరుగుదల కనిపించింది. ఒకవైపు
పన్నుల భారం తగ్గిస్తున్నా మరోవైపు ఆదాయం పెరుగుతూనే ఉంది. మరోవైపు పన్ను
పరిధిని పెంచడానికి ఎన్నో చర్యలు తీసుకున్నాం. దానివల్ల వ్యక్తిగత పన్ను
చెల్లింపుదారుల సంఖ్య 2013-14 నుంచి 2020-21 మధ్యకాలంలో 3.5 కోట్ల నుంచి 6.5
కోట్లకు చేరింది. పన్ను చెల్లించడం అన్నది బాధ్యత. అది జాతి నిర్మాణంతో నేరుగా
ముడిపడి ఉంది. పన్ను పరిధి పెరగడం ప్రభుత్వంపట్ల ప్రజలపై ఉన్న నమ్మకానికి
నిదర్శనం. మనం కట్టే పన్ను మంచి కోసం ఉపయోగిస్తారన్న నమ్మకం వారిలో నెలకొంది.
కొన్నిసార్లు చిన్న ప్రయత్నాలే పెద్ద ఫలితాలను చూపుతుంటాయి. ఒకప్పుడు ప్రజలు
తాము కొన్నవాటికి బిల్లులు తీసుకొనేవారు కాదు.