విజయవాడ : ఆంధ్రప్రదేశ్లో మహిళా సంక్షేమం కోసం ప్రభుత్వం ఎంతగానో కృషి
చేస్తోందని ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బుధవారం విజయవాడ ఏపీ ప్రెస్ అకాడమీ
కార్యాలయంలో జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఏపీ
ప్రభుత్వంపై, సీఎం జగన్మోహన్రెడ్డి పైనా కొమ్మినేని ప్రశంసలు గుప్పించారు.
ఏపీ ప్రభుత్వం మహిళల కోసం ఎంతో చేస్తోంది. మహిళలకు సీఎం జగన్ అన్ని రంగాల్లో
పెద్దపీట వేశారు. రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం కల్పించారు. మార్కెట్ యార్డు
పదవులను సైతం మహిళలకు కేటాయించడం చరిత్రలో ఇదే తొలిసారి అని కొమ్మినేని
తెలిపారు.
సమాచార శాఖ కమీషనర్ విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిజం వృత్తి అంటేనే
ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని, మహిళలు ఆ సవాళ్లను ఎదుర్కొని రాణించడం
సంతోషంగా ఉందని అన్నారు. అలాగే, ఏపీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి మహిళలకు
అధికప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. ‘‘ప్రతీ పథకంలోనూ మహిళలకే పెద్దపీట
వేస్తున్నారు. 30 లక్షల ఇళ్ల పట్టాలు మహిళల పేరిట ఇచ్చారని పేర్కొన్నారు.
అలాగే మహిళా జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాం అని హామీ
ఇచ్చారు. ఈ సందర్భంగా వీరిరువురు ప్రెస్ అకాడమీ తరపున పలువురు మహిళా
జర్నలిస్టులను సత్కరించారు.