విజయవాడ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణపై ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షులు
తోట చంద్రశేఖర్ స్పందించారు. శనివారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ
బీజేపీ మతాల పేరుతో ప్రజలను రెచ్చగొడుతుందన్నారు. ప్రశ్నించే వారిపై దర్యాప్తు
సంస్థల్ని బీజేపీ ప్రేరేపిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వాలను కూలగొట్టెందుకు
బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బీజేపీకి జాతీయ స్థాయిలో బీఆర్ఎస్
ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా ఎదుగుతుందన్నారు. అన్ని శక్తులను ఐక్యం
చేసేందుకు కేసీఆర్ అడుగులు వేస్తున్నారని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు
దేశంలో ఉండకూడదని బీజేపీ భావిస్తోందన్నారు. దర్యాప్తు సంస్థల్ని వేట కుక్కల
మాదిరిగా ప్రతిపక్షాల పైకి వదిలిందని విరుచుకుపడ్డారు. దర్యాప్తు సంస్థల
వేధింపులకు బీఆర్ఎస్ భయపడదని స్పష్టం చేశారు. కవిత పై ఈడీ కేసులు కక్ష పూరిత
చర్యే అని ఆయన అన్నారు.
ఏపీలో భారీగా చేరికలు : రాష్ట్ర విభజనలో తెలుగు రాష్ట్రాల కు బీజేపీ అన్యాయం
చేసిందని ఆరోపణలు గుప్పించారు. విభజన హామీలు అమలు చేయకుండా ఏపీ కి అన్యాయం
చేశారన్నారు. పోలవరం, ప్రత్యేక హోదా విషయంలో మోసం చేసిందన్నారు. రాజధాని
విషయంలో పొలిటికల్ బ్లేమ్ గేమ్ ఆడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో
బీజేపీ ఇచ్చిన కడప స్టీల్ ప్లాంట్ , విజయవాడ మెట్రో, పెట్రో కెమికల్ కారిడార్
ఏమైందని ప్రశ్నించారు. ఏపీకి 10 ఏళ్లు హోదా ఇస్తామన్న ప్రధాని హామీ ఏమైందని
నిలదీశారు. బీజేపీకి చిత్త శుద్ధి లేదు కాబట్టి ఏపీ అభివృద్ధికి సహకారం
అందించడం లేదన్నారు. దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా పోరాటం చేయడంలో
కాంగ్రెస్ విఫలం అయ్యిందన్నారు. బీజేపీని ఎదుర్కోవడం బీఆర్ఎస్కు మాత్రమే
సాధ్యం అవుతుందని అన్నారు. రాజకీయ నిరుద్యోగులు మాత్రమే బీజేపీలో
చేరుతున్నారని తెలిపారు. ఏపీలో భారీగా చేరికలు ఉండబోతున్నాయన్నారు. టీడీపీ,
వైసీపీలు ఏపీకి అన్యాయం చేశాయని విమర్శించారు. ఏపీలో పెట్టుబడుల పేరుతో వైసీపీ
కూడా మోసం చేసిందన్నారు. పెట్టుబడిదారులకు నమ్మకం కలిగించడంలో ఏపీలో
ప్రభుత్వాలు విఫలం అయ్యాయని అన్నారు. ఏపీలో 175 నియోజవర్గాలు, 25 ఎంపీ
స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను నిలుపుతామని తోట చంద్రశేఖర్ వెల్లడించారు.