అమరావతి : రాజకీయంగా వైరిపక్షాలైన కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై మొగ్గలోనే
వైఎస్సార్సీపీని తుంచేసేందుకు కుట్రలు చేశాయి. ప్రపంచ చరిత్రలోనే ఏ రాజకీయ
పార్టీ ఎదుర్కోనన్ని సవాళ్లు.. దాడులను ఎదుర్కొంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి
వాటినే సోపానాలుగా మలుచుకుంటూ.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అలుపెరుగని
పోరాటం చేశారు. 45 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు.. విప్లవాత్మక సంస్కరణలతో
సుపరిపాలన అందిస్తూ వైఎస్సార్సీపీని బలీయమైన శక్తిగా తీర్చిదిద్దారు.
కాంగ్రెస్ పార్టీకి రెండుసార్లు ఒంటి చేత్తో అధికారాన్ని అందించిన వైఎస్
రాజశేఖరరెడ్డి 2009 సెప్టెంబరు 2న హెలికాప్టర్ ప్రమాదంలో హఠాన్మరణం చెందారు.
ఆ విషాద వార్తను తాళలేక వందలాది మంది మరణించడం.. వైఎస్ జగన్‌ను, ఆయన
కుటుంబీకులను కలిచి వేసింది.
2010 ఏప్రిల్ 9న పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఓదార్పు యాత్ర ప్రారంభించారు. ఆ
యాత్రను ఆపేయాలని కాంగ్రెస్ అధిష్టానం వైఎస్ జగన్‌ను ఆదేశించింది. ఇది
రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేదని తల్లి వైఎస్ విజయమ్మ, సోదరి షర్మిలతో కలిసి
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాందీకి వైఎస్ జగన్ వివరించినా లాభం
లేకపోయింది. ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి వైఎస్ జగన్ ఓదార్పు యాత్రను
కొనసాగించారు. దీంతో కాంగ్రెస్‌లోని కొన్ని శక్తులు, టీడీపీతో కుమ్మక్కై
కుట్రలకు తెరతీశాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌కు, పులివెందుల శాసనసభ, కడప
లోక్‌సభ స్థానాలకు వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్ రాజీనామా చేశారు.
జనం పక్షాన జగన్ పోరుబాట : ప్రజా సమస్యలపై వైఎస్ జగన్ పోరుబాట పట్టారు. ఈ
నేపథ్యంలో జగతి పబ్లికేషన్స్‌కు ఆదాయపు పన్ను శాఖతో నోటీసులు జారీ చేయించడం
ద్వారా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ వేధింపుల పర్వాన్ని ప్రారంభించారు.
అయినా వాటిని లెక్క చేయని వైఎస్ జగన్.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధనే
లక్ష్యంగా, రాష్ట్ర సమగ్రాభివృద్ధే ధ్యేయంగా 2011 మార్చి 11న వైఎస్సార్సీపీ
పేరును ప్రకటించారు. ఆ మరుసటి రోజే వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో వైఎస్
సమాధి వద్ద పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. 2011 ఏప్రిల్ 12న కేంద్ర ఎన్నికల
సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.
నైతిక విలువలే పునాది : నైతిక విలువలతో రాజకీయాలు చేయాలన్నది వైఎస్ జగన్
సిద్ధాంతం. వైఎస్సార్సీపీలో ఎవరైనా చేరాలంటే వారు ఆ పార్టీకి, ఆపార్టీ ద్వారా
సంక్రమించిన పదవులకు రాజీనామా చేసి రావాలని షరతు విధించారు. దానికి కట్టుబడిన
19 మంది ఎమ్మెల్యేలు, ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ఆ
పార్టీ ద్వారా సంక్రమించిన పదవులకు రాజీనామా చేసి, వైఎస్సార్సీపీలో చేరారు.
వారిని తిరిగి గెలిపించుకునేందుకు వైఎస్ జగన్ విస్తృతంగా ప్రచారం
నిర్వహించారు. అదే సమయంలో వైఎస్ జగన్‌ను విచారణ పేరుతో పిలిచిన సీబీఐ 2012,
మే 27న అరెస్టు చేసింది.