టీమిండియా, నెదర్లాండ్స్ జట్ల మధ్య సిడ్నీ వేదికగా జరిగిన వరల్డ్ కప్ టీ20 మ్యాచ్‌లో టీమిండియా 56 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఉత్కంఠ పోరులో పాక్‌ను చిత్తు చేసిన టీమిండియా నెదర్లాండ్స్ జట్టుతో జరిగిన ఈ మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగించింది.
టీమిండియా నిర్దేశించిన 180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో నెదర్లాండ్స్ చతికిలపడింది. నెదర్లాండ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లను కోల్పోయి 123 పరుగులకే చేతులెత్తేసింది. సిడ్నీ పిచ్ ఫస్ట్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే పరిస్థితులు ఉండటంతో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు రోహిత్ శర్మ 53 పరుగులుతో రాణించాడు. అయితే.. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (9) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. రివ్యూ కోరకపోవడంతో రాహుల్ నాటౌట్ అయినప్పటికీ ఔట్‌గా పెవిలియన్ బాట పట్టాల్సి వచ్చింది.
ఆ తర్వాత.. క్రీజులోకొచ్చిన టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, యువ ఆటగాడు సూర్య కుమార్ యాదవ్ జట్టుకు మంచి భాగస్వామ్యాన్ని అందించారు. ఇద్దరూ కలిసి నిలకడగా ఆడుతూ 48 బంతుల్లో 95 పరుగులు చేశారు. కోహ్లీ 62 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 51 పరుగులతో రాణించి చెరొక హాఫ్ సెంచరీ చేసి నాటౌట్‌గా నిలిచారు. 180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్ జట్టును టీమిండియా బౌలర్లు బెంబేలెత్తించారు. తొలి ఓవర్లో భువనేశ్వర్ ఒక్క పరుగు కూడా రాకుండా కట్టడి చేశాడు.
మొత్తం 3 ఓవర్లు బౌలింగ్ చేసిన భువనేశ్వర్ కుమార్ 2 వికెట్లు తీసి 2 ఓవర్లు మేడిన్ చేసి సత్తా చాటాడు. 11 పరుగులకే నెదర్లాండ్స్ తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ విక్రమ్‌జిత్ సింగ్‌ను భువనేశ్వర్ బౌల్డ్ చేశాడు. అక్షర్ పటేల్ 4 ఓవర్లు బౌలింగ్ చేసి 18 పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు తీశాడు. టీమిండియా బౌలర్లలో భువనేశ్వర్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, రవిచంద్రన్ అశ్విన్ తలో రెండు వికెట్లతో రాణించారు. షమీ ఒక వికెట్ తీశాడు. నెదర్లాండ్స్ బౌలర్లలో క్లాసెన్, వాన్ మికెరెన్ చెరో వికెట్ తీశారు.