న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయదలచిన బల్క్ డ్రగ్ పార్క్‌లో
ఉమ్మడి మౌలిక వసతుల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వానికి వెయ్యి కోట్ల రూపాయల
ఆర్థిక సహాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు రసాయన, ఎరువుల
శాఖ సహాయ మంత్రి భగవంత్ ఖుబా వెల్లడించారు. బల్క్ డ్రగ్ పార్క్‌లో మౌలిక
వసతుల కల్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని చెప్పారు. రాజ్యసభలో మంగళవారం
వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి
రాతపూర్వకంగా జవాబిస్తూ దేశంలో బల్క్ డ్రగ్ పార్క్‌ల ప్రోత్సహించే ఉద్దేశంతో
కేంద్ర ఫార్మాసూటికల్స్ విభాగం ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు.
విశాఖపట్నంలో ఎయిర్ కార్గో టెర్మినల్, విశాఖ పోర్టులో కంటైనర్ టెర్మినల్
వంటి రవాణా వసతులు సిద్ధంగా ఉన్నందున ఫార్మా కంపెనీలను ప్రోత్సహించడానికి
ఆంధ్రప్రదేశ్‌లో మరిన్ని బల్క్ డ్రగ్ పార్క్‌లను ఏర్పాటు చేసే ఆలోచన
ప్రభుత్వానికి ఉందా అని విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ఈ
బల్క్ డ్రగ్ పార్క్ ద్వారా దేశీయ వినియోగంతోపాటు, ఎగుమతులకు అవసరమైన మందుల
తయారీకి అనువైన వాతావరణ పరిస్థితుల కల్పనే ఈ పథకం ఉద్దేశమని చెప్పారు. ఈ పథకం
మార్గదర్శకాలను అనుసరించి బల్క్ డ్రగ్ పార్క్‌లో ఏర్పాటయ్యే ఫార్మా
పరిశ్రమలకు ఫార్వార్డ్, బాక్వార్డ్ లింకేజీతో మద్దతుతో కనెక్టివిటీని
కల్పించే అవకాశాల ప్రాతిపదికపైనే వాటిని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలో నిర్ణయం
జరిగిందని మంత్రి తెలిపారు.
కర్నూలు కేన్సర్ ఆస్పత్రికి 72 కోట్లు
న్యూఢిల్లీ : కర్నూలు మెడికల్ కాలేజీలో రాష్ట్ర ప్రభుత్వం 120 కోట్ల రూపాలతో
ఏర్పాటు చేస్తున్న కేన్సర్ ఇన్స్టిట్యూట్ కోసం కేంద్రం తన వాటా కింద 72
కోట్ల రూపాయలు భరిస్తున్నట్లు ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్
పవార్ మంగళవారం రాజ్యసభకు తెలిపారు. విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి
రాతపూర్వకంగా జవాబిస్తూ కేన్సర్ చికిత్స కోసం దేశ వ్యాప్తంగా 19 రాష్ట్రాలలో
కేన్సర్ ఇన్స్టిట్యూట్లు, 20 టెరిషియరీ కేర్ కేన్సర్ సెంటర్లు
నెలకొల్పాలన్న నిర్ణయంలో భాగంగానే కర్నూలు మెడికల్ కాలేజీలో రాష్ట్ర స్థాయి
కేన్సర్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. కేన్సర్
ఇన్స్టిట్యూట్ ఏర్పాటు కోసం కర్నూలు మెడికల్ కాలేజీకి ఇప్పటి వరకు 54 కోట్ల
రూపాయల ఆర్థిక సహాయం అందించినట్లు చెప్పారు. అలాగే మంగళగిరి ఎయిమ్స్‌లో
కేన్సర్ చికిత్సలో భాగంగా సర్జికల్ ఆంకాలజీ, రేడియో థెరపీ సేవలను 2021లోనే
ప్రారంభించగా ఎయిమ్స్‌లోని మెడికల్, సర్జికల్ స్పెషలిస్టులు అందరూ
కేన్సర్‌కు చికిత్స అందిస్తున్నారని మంత్రి వెల్లడించారు.