ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి
తిరువూరు : వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని, ప్రజలకు మేలు చేసే
ప్రభుత్వమని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరోమారు వెల్లడించారు. ఆదివారం
తిరువూరులో జరిగిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. జగనన్న విద్యా దీవెన పథకం
నిధులను జగన్ విడుదల చేశారు. పేదరికం కారణంగా పిల్లలు చదువుకు దూరం కాకూడదనే
ఉద్దేశంతోనే విద్యాదీవెన పథకం తీసుకొచ్చామని తెలిపారు. ఈ పథకం కింద నేరుగా
విద్యార్థుల తల్లుల ఖాతాలో సొమ్ము జమ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా
ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్ష నేతలపై మండిపడ్డారు. మా ప్రభుత్వం ప్రజలకు మేలు
చేయకపోతే పొత్తుల కోసం ప్రతిపక్షాలన్నీ ఎందుకు వెంపర్లాడుతున్నాయని జగన్
ప్రశ్నించారు. ఎందుకు ఈ తోడేళ్లు ఏకం అవుతున్నాయని నిలదీశారు. ఎవరెన్ని
కుట్రలు చేసినా కూడా చివరకు మంచి చేసిన వాడు మాత్రమే గెలుస్తాడని అన్నారు.
రామాయణం, భారతం, బైబిల్, ఖురాన్.. ఎందులో చూసినా మంచిని మాత్రమే విజయం
వరిస్తుందని ఉంటుందన్నారు. ఏ సినిమా చూసినా అందులో హీరోలు మాత్రమే
ప్రేక్షకులకు నచ్చుతారని జగన్ చెప్పారు. గ్రామగ్రామానికి, ఇంటింటికీ చేరిన
అభివృద్ధి ఫలాలపై కానీ, రైతులకు, అక్కాచెల్లెళ్లకు, అవ్వాతాతలకు, బడిపిల్లలకు
అందుతున్న సంక్షేమ ఫలాల విషయంలో కానీ ఇలా ఏ విషయంలోనూ తమ ప్రభుత్వంతో వారి
పాలనను పోల్చుకోలేరని జగన్ విమర్శించారు. గతంలో దోచుకో, పంచుకో, తినుకో అనేలా
డీపీటీ ప్రభుత్వం నడిచిందని జగన్ విమర్శించారు. తమది మాత్రం డీబీటీ
ప్రభుత్వమని స్పష్టం చేశారు. అలాంటి వారు ఇప్పుడు ఏకమవుతున్నారని, విలువలు
లేని దుష్టచతుష్టయంతో తాము పోరాడుతున్నామని జగన్ తెలిపారు.
పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువే : పేదరికం నుంచి బయటపడాలంటే అది విద్యతోనే
సాధ్యం అవుతుందన్నారు. నేరుగా విద్యార్థుల తల్లలు ఖాతల్లోకి నగదు జమ
చేస్తున్నాం. పిల్లలకు ఆస్తి మనం ఇచ్చే చదువేనని సీఎం అన్నారు.
కాలేజీలో సమస్యలుంటే 1092కి ఫిర్యాదు : పేదలు బాగుండాలనే నవరత్నాలు
ప్రవేశపెట్టామన్నారు ముఖ్యమంత్రి. బలహీన వర్గాలు బలపడాలంటే అది విద్యతోనే
సాధ్యమని పేర్కొన్నారు. ఒక కుటుంబం తలరాతను మార్చే శక్తి చదువుకు మాత్రమే
ఉందన్నారు. ఒక మనిషి జీవన ప్రమాణం, జీవన ప్రయాణం నిర్దేశించేది చదువేనని
తెలిపారు. తల్లుల ఖాతాలో నగదు జమ చేయడం ద్వారా ప్రశ్నించే హక్కు ఉంటుందన్నారు.
కాలేజీలో సమస్యలుంటే 1092కి ఫిర్యాదు చేస్తే మేమే మాట్లాడతామని పేర్కొన్నారు.
పూర్తి బాధ్యత మీ జగనన్నదే : ‘దేశంలో విద్యాదీవెన, వసతి దీవెన పథకాలు ఎక్కడా
లేదు. కాలేజీ ఫీజులు ఎంతైనా సరే పూర్తి బాధ్యత మీ జగనన్నదే. గత ప్రభుత్వంలో
అరకొర ఫీజులు మాత్రమే ఇచ్చారు. ఫీజులు కట్టలేక చదువులు మానివేసే పరిస్థితి
రాకూడదు. లంచాలు, వివక్ష లేకుండా నేరుగా రూ.698.68 కోట్లు జమ చేస్తున్నాం.
పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా రూ.9947 కోట్లు అందించాం. ఫీజు
రీయింబర్స్మెంట్ ద్వారా 27 లక్షలమంది విద్యార్థులకు లబ్ధి. గత ప్రభుత్వం
పెట్టిన బకాయిలను చిరునవ్వుతో చెల్లించామన్నారు.
చదువులకు పేదరికం అడ్డు కాకూడదు : ప్రతి మూడు నెలలకు ఒకసారి ఫీజులు
చెల్లిస్తున్నాం. ఫీజులు మాత్రమే కాదు వసతి ఖర్చులు కూడా ఇస్తున్నాం. ఏప్రిల్
11న రెండో విడత వసతి దీవెన నిధులు. ఈ పథకాలతో చదువుకునే విద్యార్థలు సంఖ్య
పెరిగింది. చదువులకు పేదరికం అడ్డు కాకూడదు. ప్రతి తరగతి గదిని డిజిటైజ్
చేస్తున్నాం. జీఈఆర్ రేషియో 32 శాతం నుంచి 72 శాతానికి తీసుకెళ్తే దిశగా
అడుగులు. రెండేళ్లలో ప్రభుత్వ బడులను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతాం.
ప్రభుత్వ పాఠశాలలతో కార్పొరేట్ స్కూళ్లు పోటీ పడేలా చేస్తున్నాం. మీ పిల్లల
చదువులకు నాది బాధ్యత’ అని సీఎం జగన్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.