జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్
విజయవాడ : “దేశం కోసం చనిపోయేవారు ఎల్లకాలం బతికే ఉంటారు”.. అంటారు శ్రీ భగత్
సింగ్. స్వర్గీయ భగత్ సింగ్, శివరాం రాజ్ గురు, సుఖదేవ్ థాపర్ విషయంలో ఈ
పలుకులు అక్షర సత్యం అనిపిస్తాయని జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు.
మరణించి అమరులైనా నిరాకారంతో మన మధ్య జీవిస్తూనే ఉన్న వీరు చిరంజీవులు.
సరిగ్గా ఇదే రోజున అంటే మార్చి 23, 1931న ఈ ముగ్గురు వీరులు దేశమాత
దాస్యశృంఖలాలను తెంచడానికి లాహోర్ జైలులో ఉరి కంబాన్ని ముద్దాడారు. పట్టుమని
పాతికేళ్ళు నిండకుండానే ఈ ముగ్గురూ దేశంలో రగిలించిన స్వతంత్ర కాంక్ష,
విప్లవాగ్ని పరాయి పాలకులు దేశం నుంచి పారిపోయేంత వరకు జ్వలిస్తూనే ఉన్నాయి. ఈ
పుణ్య తిథి నాడు ఆ అమరవీరులకు శిరస్సు వంచి అంజలి ఘటిస్తున్నాను. ఈ వీరుల
బలిదానాలను స్మరించుకోడానికి ఏటా ఈ రోజున షహీద్ దివస్ (అమరుల సంస్మరణ)
నిర్విహించుకుంటున్నాము. అయితే ఇది మాత్రమే సరిపోదని నా భావన. ఈ మహానీయులను
నిత్యం స్మరించుకోవాలి. అందుకు తగిన విధంగా ఈ వీరుల విగ్రహాలను దేశవ్యాప్తంగా
విరివిగా ఏర్పాటు చేయాలి. స్మారక స్తూపాలు నెలకొల్పాలి. వీరి చరితను చిరంతనంగా
మన యువతకు అందించాలి. జాతిని నిత్యం జాగృతం చేయాలి. చివరిగా.. “నన్ను చంపవచ్చు
కానీ నా ఆలోచనలు చంపలేరు” అంటారు భగత్ సింగ్. నిజమే- ఈ వీరుల ఆలోచనలు, భావ
గాఢత దేశభక్తుల మదిలో పదిలంగా ఉన్నాయని జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్
అన్నారు.