విజయవాడ : ఈ దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను చూస్తుంటే కక్ష సాధింపులు,
అరాచకాలు, నిరంకుశత్వాలు తప్ప ప్రజాస్వామ్య రాజకీయాలు కనిపించడం లేదని ఏపిసిసి
అధ్యక్షులు గిడుగు రుద్రరాజు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. విజయవాడ
ఆంధ్రరత్న భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోడీ నాయకత్వం
లోని కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కుతుందని రుద్రరాజు తీవ్రంగా
దుయ్యపట్టారు. సూరత్ లో 2019 లో జరిగిన పరిణామాలను 4 సంవత్సరాల పాటు వొదిలేసి
అక్కడ బిజెపి నాయకుడు వేసిన పిటిషన్ బైటకి లాగి రాహుల్ గాంధీ ని దోషిగా చూపి
కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటుందని బిజెపి, మోదిలను, వారి వారి దుశ్చర్యలను
ఎండగట్టారు. నీరవ్ మోడీ, లలిత్ మోడీ, నరేంద్ర మోడీ లన్న మాటలను నేరంగా చూపి
పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయడం వెనుక బిజెపి, ప్రధాని మోడీ కుట్రపూరిత
రాజకీయాలు వున్నాయని ఆయన ఆరోపించారు. ఇందిరా, రాజీవ్ లను పోగొట్టుకున్న గాంధీ
కుటుంబం త్యాగాల కుటుంబముని, తాటాకు చప్పుళ్లకు గాంధీ కుటుంబం బెదిరేది లేదని
స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ అధికారంలో వున్న ఉత్తరప్రదేశ్,
ఉత్తరాఖాండ్, కర్ణాటక రాష్ట్రాలలో ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయని, గౌరవ శాసన
సభ్యుల మీద కేసులు కూడా నమోదు కావడం లేదని తీవ్రంగా దుయ్యబట్టారు.
ప్రతిపక్ష పార్టీ ల మీద సిబిఐ, ఈడి అక్రమంగా తనిఖీలు చేస్తుంటే దేశ ప్రజలు
సహించరని కేంద్ర ప్రభుత్వాన్ని రుద్రరాజు హెచ్చరించారు. ఢిల్లీలో మా నాయకత్వం
ఆదేశాల మేరకు కార్యక్రమాలను రాష్ట్ర స్థాయిలో ఉధృతం చేస్తామని జాతీయ కాంగ్రెస్
అధ్యక్షులు ఖర్గే గారి ఆదేశాల మేరకు ప్రజలతో కలిసి రాహుల్ గాంధీకి అండగా
ఉంటామని అందుకు సంఘీభావం గా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు తీవ్రతరం చేస్తామని
ఏపిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు పార్టీ భవిష్యత్ ప్రణాళికను ప్రకటించారు.
అనంతరం ఆయన పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ కార్యనిర్వహక
అధ్యక్షులు సుంకర పద్మశ్రీ, విజయవాడ నగర అధ్యక్షులు నరహరసెట్టీ నరసింహ రావు,
లీగల్ సెల్ చైర్మన్ వి.గురునాధం, పి.వై.కిరణ్, కొలనుకొండ శివాజీ, ఖాజా
మొహిద్దిన్, తాంతియా కుమారి, ఏఐసిసి సభ్యులు మేడా సురేష్, పీటర్ జోసెఫ్
తదితరులు పాల్గొన్నారు.